టీఎన్జీవో నేతలా.. మజాకా! ప్రమోషన్లు వస్తున్నా సంఘాన్ని వీడేందుకు ససేమిరా..

టీఎన్జీవో నేతలా.. మజాకా! ప్రమోషన్లు వస్తున్నా సంఘాన్ని వీడేందుకు ససేమిరా..
  • టీఎన్జీవో పేరును ‘తెలంగాణ నేటివ్​ గవర్నమెంట్​​ ఆఫీసర్స్​ యూనియన్​’​గా మార్చే యత్నం
  • ఉద్యోగ సంఘాలకు ఉన్న ఆస్తులను గుప్పిట్లో పెట్టుకోవాలనే వ్యూహం
  • టీజీవో సంఘం తీవ్ర అభ్యంతరం.. హైకోర్టు నుంచి స్టేటస్ కో
  • సీఎంకు ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు
  • పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో లుకలుకలు మొదలయ్యాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో​)లో పదవీ వ్యామోహం ముదురుపాకాన పడింది.  సదరు నేతలు తమ పదవులను కాపాడుకునేందుకు అనుసరిస్తున్న వింత పోకడలు ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీఎన్​జీవో​లో కీలకంగా ఉన్న ఒకరికి గెజిటెడ్​ఆఫీసర్​గా పదోన్నతి రాగా, మరో ముగ్గురు పదోన్నతులు వచ్చినా తీసుకోవడం లేదు.  

ప్రమోషన్​ తీసుకుంటే గెజిటెడ్​ఆఫీసర్​ కావాల్సి వస్తుందని, అదే జరిగితే సంఘాన్ని వీడాల్సి వస్తుందని ఏకంగా పదోన్నతులను వాయిదా వేసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాలకు ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులు, వాటిపై నెలనెలా వచ్చే ఆదాయం కోల్పోవడం ఇష్టం లేని సంఘం నేతలు కొత్త ఆలోచన చేశారు.

ప్రమోషన్ తీసుకున్నా సంఘం బాధ్యతల్లో కొనసాగేందుకు వీలుగా టీఎన్జీవో పేరుతోపాటు బైలాస్​ మార్చే ప్రయత్నం చేస్తుండడంతో టీజీవో, టీఎన్జీవో సంఘాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

పదవులు కావాలె.. ప్రమోషన్లు ఉండాలె..

టీఎన్జీఓలో ఉండి పదోన్నతి పొందితే గెజిటెడ్​ అధికారిగా టీజీఓ సంఘంలోకి మారాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం సంఘాన్ని వీడాల్సి ఉన్నా.. ఆ కుర్చీని వదలడానికి కీలక లీడర్లు ససేమిరా అంటున్నారు.  తాము గెజిటెడ్ అధికారులమైనా టీఎన్జీవోలోనే కొనసాగేందుకు  వీలుగా సంఘం పేరునే మార్చాలనే కుట్రకు తెరతీశారు. ‘తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్’ పేరులోని ‘నాన్ గెజిటెడ్’ పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘నేటివ్ గవర్నమెంట్’ అనే పదాన్ని చేర్చి ‘తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్’ (టీఎన్జీవో)గా మార్చాలని చూస్తున్నారు. 

తద్వారా అబ్రివియేషన్ మారకుండా గెజిటెడ్ హోదాలోనూ పెత్తనం చెలాయించవచ్చనే నేతల వ్యూహం ఉద్యోగ వర్గాల్లో  దుమారం రేపుతోంది. కేవలం పదవుల్లో కొనసాగడమే కాకుండా, సంఘానికి ఉన్న వేల కోట్ల రూపాయల ఆస్తులను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకే ఈ సరికొత్త ఎత్తుగడ వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ చర్యపై నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో పాటు గెజిటెడ్ అధికారుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ఈ పేరు మార్పు , బైలాస్​సవరణ ప్రయత్నాలపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. 

గెజిటెడ్ అధికారులుగా మారిన వారు టీజీవోలో చేరాలే తప్ప, పాత సంఘం నియమ, నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకోవడం చట్టవిరుద్ధమని వాదించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. జీవో ఎంఎస్ నం. 264కు విరుద్ధంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అధికారుల కమిటీని ఆదేశించింది. నిబంధనలకు భిన్నంగా గెజిటెడ్ అధికారులు నాన్ గెజిటెడ్ సంఘాల్లో సభ్యులుగా ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది.

గెజిటెడ్​ అధికారుల పెత్తనం కింద పనిచేయం

ఈ పేరు మార్పు ప్రయత్నాలను సాధారణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గెజిటెడ్ అధికారుల పెత్తనం కింద ఉంటే తమ కింది స్థాయి ఉద్యోగుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. సంఘం పేరులో 'నాన్ గెజిటెడ్' పదాన్ని తొలగించడమంటే సంఘం ఆత్మను చంపేయడమేనని వారు వాపోతున్నారు. నేతలు తమ వ్యక్తిగత లాభాల కోసం, ఆస్తుల నిర్వహణ కోసం సంఘం మూలాలనే దెబ్బతీస్తున్నారని, ఇది తమ హక్కులను కాలరాయడమేనని మండిపడుతున్నారు. సంఘం పేరు మారిస్తే తమ అస్తిత్వానికే ప్రమాదమని, తమ గొంతు నొక్కేసే ప్రయత్నమిదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

నేతలు ఇంతలా కుర్చీకి అతుక్కుపోవడానికి ప్రధాన కారణం సంఘానికి ఉన్న భారీ ఆస్తులేనని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీఎన్జీవో సంఘంతో పాటు టీజీఓ సంఘాలకు వేల కోట్ల రూపాయాల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అంచనా.  టీఎన్​జీవోకు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఖరీదైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్సులు ఉన్నాయి. వీటి నుంచి నెలకు రూ. 2 కోట్లపైనే అద్దె వస్తున్నట్లు సమాచారం. ఈ భారీ ఆదాయంపై ఇప్పటివరకు సరైన ఆడిటింగ్ జరగలేదని, అధికారికంగా చాలా తక్కువ మొత్తం చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆడిటింగ్ లేకపోవడం వల్లే నిధుల దుర్వినియోగం జరుగుతోందని, ఆ పెత్తనం కోల్పోకూడదనే పేరు మార్పు జిమ్మిక్కులు చేస్తున్నారని క్షేత్రస్థాయి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. ఉద్యోగ సంఘాల ఆస్తులపై పారదర్శకత ఉండాలని, తక్షణమే ప్రత్యేక కమిటీ వేసి ఆడిటింగ్ నిర్వహించాలని డిమాండ్లు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొన్నది. 

ఎవరికి వారే యమునా తీరే..

టీజీఓ, టీఎన్​జీవో ఉద్యోగ సంఘాలన్ని కలిసి జేఏసీగా ఉన్న విషయం తెలిసిందే. వివిధ సందర్భాల్లో ఉద్యోగుల సమస్యలపై ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం ద్వారా డిమాండ్లను సాధించుకుంటున్నారు. కానీ ఈ ఇష్యూపై ఈ రెండు సంఘాలు చీలిపోయాయి. అదే సమయంలో రెవెన్యూ డిపార్ట్ మెంట్ లోని సంఘాలు,  మరికొన్ని ఇతర సంఘాలు ప్రత్యేకంగా లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయన కూడా ఉద్యోగుల జేఏసీ చైర్​పర్సన్​గా ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో ఉద్యోగ సంఘాలన్నీ పూర్తిగా ఎవరికి వారే అన్నట్లుగా తయారయ్యారనే చర్చ మొదలైంది. ఇలాగే కొనసాగితే.. తమ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు తప్పవనే  ఆందోళన ఉద్యోగవర్గాల్లో వ్యక్తమవుతోంది.