హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జీరో టాలరెన్స్ విధానంలో తాగి బండి నడిపినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీకెండ్స్‌లో నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో హైదరాబాద్నగర వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 604మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవీస్ తెలిపారు.
రెండు రోజులుగా నగరవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో 604 మంది వాహనదారులపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో బైకర్స్ ఎక్కువగా ఉన్నారు. 492 మంది బైకిస్టులు, 42 మంది ఆటో డ్రైవర్లు, 70 మంది ఫోర్ వీలర్స్ ఇతర వాహన దారులపై కేసులు నమోదు చేశారు. వీరంతా అధికమొత్తంలో మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు పోలీసులు చెప్పారు.
ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారుల్లో రక్తంలో ఆల్కహాల్ మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. అనుమతించిన పరిమితి 30 మైక్రోగ్రాములు మాత్రమే కాగా.. అంతకు నాలుగైదు రెట్లు ఉన్నట్లు గుర్తించారు. డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.
