టీమిండియాకు గుడ్ న్యూ్స్. భారత స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. పక్కటెముకల గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచుకు దూరమైన వాషీ కోలుకున్నాడు. ఢిల్లీ వేదికగా నమీబియాతో ఇండియా తలపడనున్న రెండో మ్యాచ్ కోసం అతడు జట్టులో చేరనున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ధృవీకరించారు.
అమెరికాతో మ్యాచ్ అనంతరం వాషింగ్టన్ సుందర్ గాయంపై స్కై అప్డేట్ ఇచ్చాడు. సైడ్ స్ట్రెయిన్ గాయం కారణంగా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసంలో ఉన్న వాషింగ్టన్ సుందర్ కోలుకున్నాడని.. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలిపాడు. నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వాషీ జట్టులో చేరుతాడని చెప్పాడు.
ఇక, అమెరికాతో జరిగిన వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచులో స్టార్ పేసర్ బుమ్రా ఆడకపోవటానికి కారణమేంటో కూడా స్కై వెల్లడించాడు. తీవ్రమైన వైరల్ ఫీవర్ కారణంగా బుమ్రా అమెరికాతో జరిగిన మ్యాచ్ ఆడలేకపోయాడని చెప్పాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం కుదుటపడిందన్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరోగ్యం కూడా బాలేదని.. అయినప్పటికీ అతడు అమెరికాతో మ్యాచులో బరిలోకి దిగాడని చెప్పాడు.
