హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్ ఫ్యామిలీని సీబీఐ ఎందుకు విచారణకు పిలవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని కంచె వేసి కాపాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డిని కిషన్ రావు అనే పిలుస్తామని స్పష్టం చేశారు.
ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 8) జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజ్య సమితి అని అభివర్ణించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌తో పలువురిని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. జర్నలిస్టులు, లాయర్లు, జడ్జిలు, రియల్టర్లు, సెలబ్రెటీల ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. చివరకు పెళ్లాం మొగుళ్ల మాటలు కూడా విన్నారని మండిపడ్డారు.
కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్కు బీజేపీ సహకరిస్తుందని.. బీజేపీ, బీఆర్ఎస్ బొమ్మ బొరుసు లాంటి వాళ్లు అని అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అవుతున్నాయని.. కానీ దెబ్బకు దెబ్బ కొడతామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం.. ప్రధాని మోడీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి చూసుకుందామని సవాల్ విసిరారు.
