షుగర్ అందకుండా చేస్తే.. ఫంగస్ ఖేల్ ఖతం! : సీసీఎంబీ సైంటిస్టుల రీసెర్చ్

షుగర్ అందకుండా చేస్తే.. ఫంగస్ ఖేల్ ఖతం! : సీసీఎంబీ సైంటిస్టుల రీసెర్చ్
  •     హైదరాబాద్ సీసీఎంబీ సైంటిస్టుల రీసెర్చ్ లో వెల్లడి 
  •     రూపం మార్చుకుని మందులకు లొంగకుండా దాడి చేస్తున్న ఫంగస్ 
  •     దాని వీక్ నెస్ పసిగట్టిన సైంటిస్టులు 
  •     ఎలుకలపై ప్రయోగం సక్సెస్

హైదరాబాద్, వెలుగు: వైరస్ లు, బ్యాక్టీరియాలే కాదు.. ఫంగస్ కూడా మందులకు లొంగకుండా మొండిగా తయారవుతూ మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. అయితే, ఈ ప్రాణాంతక ఫంగస్ భరతం పట్టే మార్గాన్ని హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సైంటిస్టులు కనుగొన్నారు. 

ఫంగస్ తన రూపాన్ని మార్చుకుని మనిషి శరీరంలో దాడి చేయడానికి, అది తీసుకునే ఆహారానికి (మెటబాలిజం) లింక్ ఉందని గుర్తించారు. ఈ మెటబాలిక్ స్విచ్ ను ఆఫ్ చేస్తే ఫంగస్ ను ఈజీగా అంతం చేయొచ్చని నిరూపించారు. ఎలుకలపై చేసిన ఈ రీసెర్చ్ వివరాలను డాక్టర్ శ్రీరామ్ వరాహన్ నేతృత్వంలోని బృందం శనివారం వెల్లడించింది.

రూపం మార్చుకోవడంలోనే దాని పవర్ 

ఫంగస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఈస్ట్ (గుండ్రని ఆకారం), రెండు ఫిలమెంటస్(పొడవాటి దారాల్లాంటి ఆకారం). ఇది మనిషి శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు గుండ్రని ఆకారంలో ఉండి రక్తంలో ప్రయాణిస్తుంది. ఒక చోట సెటిల్ అయ్యాక, నెమ్మదిగా పొడవాటి దారాల్లా (ఫిలమెంటస్) రూపం మార్చుకుంటుంది. కణజాలం లోకి చొచ్చుకుపోయి ఇన్ఫెక్షన్ ను పెంచుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ కూడా దీన్ని పసిగట్టలేకపోవడంతో మందులు వాడినా తగ్గడం లేదు. ఇన్నాళ్లు సైంటిస్టులు.. ఫంగస్ రూపం మారడానికి దానిలోని జన్యువులే కారణమని అనుకున్నారు. 

కానీ, సీసీఎంబీ రీసెర్చర్లు అసలు విషయం కనిపెట్టారు. ఫంగస్ తీసుకున్న షుగర్(చక్కెర)ను అది ఎంత వేగంగా అరిగించుకుంటుంది(గ్లైకాలైసిస్) అనే దానిపైనే దాని రూపం ఆధారపడి ఉంటుందని తేల్చారు. ఫంగస్ షుగర్ ను బ్రేక్ డౌన్ చేసినప్పుడు సల్ఫర్ తో కూడిన కొన్ని అమైనో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ అమైనో యాసిడ్సే ఫంగస్ రూపం మారడానికి స్విచ్ లాగా పని చేస్తాయి. ఎప్పుడైతే ఈ షుగర్ అరుగుదల ప్రక్రియను స్లో చేశారో.. అప్పుడు ఫంగస్ తన రూపాన్ని మార్చుకోలేకపోయింది. దాంతో అది హాని చేయని గుండ్రని ఆకారంలోనే ఉండిపోయింది. 

ఎలుకలపై ప్రయోగం సక్సెస్  

దీన్ని నిరూపించడానికి కాండిడా ఆల్బికాన్స్ అనే ఫంగస్ పై సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఫంగస్ లో షుగర్ ను అరిగించే ఎంజైమ్ ను తొలగించి ఎలుకల మీద ప్రయోగించారు. ఆశ్చర్యకరంగా ఆ ఫంగస్ ఎలుకల రోగనిరోధక కణాలైన మ్యాక్రోఫేజెస్ తో పోరాడలేకపోయింది. దాంతో ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఫంగస్ ఆకారం మార్చుకునే శక్తిని దెబ్బకొడితే.. మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని ఈజీగా చంపేస్తుందని తేలింది. అందుకే వీటిని టార్గెట్ చేసి మందులు తయారు చేస్తే.. ఫంగస్ ను సులువుగా అంతం చేయొచ్చని డాక్టర్ శ్రీరామ్ వరాహన్ తెలిపారు.