సీఎం రేవంత్ గుడ్ న్యూస్: ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు

సీఎం రేవంత్ గుడ్ న్యూస్: ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు

హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల ఆశావహులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 2026, ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. తొలి విడతలో భాగంగా నాలుగన్నర లక్షలు ఇండ్లు కట్టించామని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదలకు 25 లక్షల ఇండ్లు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ ఇందిరమ్మ ఇండ్లపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. 

ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 8) జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‎లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని పేదలకు ఆశ చూపారు.. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ఫ్యామిలీకి ఫాంహౌస్‎లు వచ్చాయి  కానీ పేదలకు ఇండ్లు రాలేదని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబానికి టీవీలు, పేపర్లు, వ్యాపారాలు వచ్చాయి కానీ పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పేదలకు ఏమి రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అందరికీ ఇండ్లు ఉండాలనే సదుద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని.. పైసా లంచం లేకుండా నేడు పేదలు ఇండ్లు కట్టుకుంటున్నారన్నారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి బీజేపీ, బీఆర్ఎస్‎కు సిగ్గుండాలని అన్నారు. కేసీఆర్, మోడీని చూసి ఓటేస్తే మోసపోతాం.. గోస పడ్తామని చెప్పారు.