T20 World Cup: వాటే మ్యాచ్.. ఓడినా.. వణికించారు: నేపాల్‎పై చచ్చిబతికి గెలిచిన ఇంగ్లాండ్

T20 World Cup: వాటే మ్యాచ్.. ఓడినా.. వణికించారు: నేపాల్‎పై చచ్చిబతికి గెలిచిన ఇంగ్లాండ్


ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. పసికూన అనుకున్న జట్లు అగ్రశేణి టీములకు ఊహించని ఝలకులు ఇస్తు్న్నాయి. ఇండియాతో జరిగిన మ్యాచులో అమెరికా బౌలర్లు భారత టాపార్డర్‏ను గడగడలాడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే.. ఇంగ్లాండ్‎ను నేపాల్ జట్టు వణించింది. పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టు నేపాల్‎పై విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. 184 పరుగుల భారీ స్కోర్ చేసి కూడా గెలుపు కోసం ఇంగ్లాండ్ చివరి బంతి వరకు పోరాడింది. మొత్తానికి నేపాల్‎పై ఇంగ్లాండ్ గెలిచిన.. నేపాల్ మాత్రం ఓడినా ఇంగ్లాండ్‎ను వణికించింది. 

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‏లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. శనివారం (ఫిబ్రవరి 8) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో నేపాల్‎పై 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై థ్రిల్లర్ మ్యాచులో నేపాల్ పోరాడి ఓడింది. నేపాల్ ఓడినా ఆ జట్టు పోరాటం క్రికెట్ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184- పరుగులు చేసింది. జాకబ్ బెథేల్ (55), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు. 

జోస్ బట్లర్ (26) ఫర్వాలేదనిపించగా.. చివర్లో విల్ జాక్స్ (39) సిక్సర్లతో విరుచుకుపడటంతో ఇంగ్లాండ్  భారీ స్కోర్ చేసింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ, నందన్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. షేర్ మల్లా, సందీప్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నేపాల్ బ్యాటర్లలో కుషాల్ భూర్తెల్ 29, రోహిత్ పౌడెల్ 39, దీపేంద్ర సింగ్ ఐరీ 44 పరుగులతో రాణించారు. 

చివర్లో లోకేష్ బాం (39)  మెరుపులు మెరిపించి నేపాల్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. లాస్ట్ ఓవర్లో 10 పరుగులు కావాల్సి ఉండగా సామ్ కర్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో నేపాల్‎కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఓడినప్పటికీ నేపాల్ మాత్రం చివరి వరకు అంచనాలకు మించి పోరాడింది. లోకేష్ బాం దూకుడు చూస్తే ఒకానొక దశలో నేపాల్ విజయం సాధిస్తుందనిపించింది. కానీ చివరి ఓవర్లో సామ్ కరాన్ 10 రన్స్‎ను డిఫెండ్ చేయడంతో ఇంగ్లాండ్  శిబిరంలో హమ్మయ్యా బతికిపోయామనే ఫీలింగ్ కలిగింది.