ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో పేలుడు : 18 మంది గల్లంతు, 54 మందికి తీవ్ర గాయాలు

ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో పేలుడు : 18 మంది గల్లంతు, 54 మందికి తీవ్ర గాయాలు

యుద్ధం వల్ల ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఖతార్ ఆయిల్ ఇండస్ట్రీకి మరో భారీ ఎదురుదెబ్బ. 2026, జూన్ 22వ తేదీ తెల్లవారుజామున ఖతార్ దేశంలోనే అతి పెద్ద గ్యాస్ ప్లాంట్ అయిన.. లఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో బార్దాన్ గ్యాస్ ప్లాంట్ లో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 18 మంది గల్లంతు అయ్యారు. వీళ్లు బతికి ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా బయటకు రాలేదు. ప్లాంట్ లో పని చేస్తున్న 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

లఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాపై ఇటీవల ఇరాన్ బాంబులతో దాడి చేసింది. ఆ క్రమంలో బర్దాన్ గ్యాస్ ప్లాంట్ దెబ్బతిన్నది. అప్పటి నుంచి ఈ ప్లాంట్ ను మూసి వేశారు. కొన్ని రోజులుగా ప్లాంట్ మళ్లీ ఓపెన్ చేసేందుకు మరమ్మతులు చేస్తున్నారు. వేల మంది కార్మికులు బార్దాన్ గ్యాస్ ప్లాంట్ లో పని చేస్తున్నారు. 

ఇలా పని చేస్తున్న సమయంలోనే బర్దాన్ గ్యాస్ ప్లాంట్ లో పేలుడు జరిగింది. పేలుడు తీవ్రంగా తీవ్రంగా ఉంది. పేలుడు జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 18 మంది ఆచూకీ లేదని.. వాళ్లు బతికి ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ ప్రకటించలేదు గ్యాస్ ప్లాంట్ యాజమాన్యం. 54 మందికి గాయాలు అయ్యాయని.. వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించినట్లు ప్రకటించారు అధికారులు. గల్లంతు అయిన వాళ్లల్లో లేదా గాయపడిన వారిలో భారతీయులు ఉన్నారా లేదా అనేది ఇంకా వెల్లడికాలేదు. 

ఖతార్ లఫాన్ జోన్ అనేది ప్రపంచంలోనే గ్యాస్ ఉత్పత్తికి అతి పెద్ద కేంద్రంగా ఉంది. ఇక్కడే బార్దాన్ అనే గ్యాస్ ప్లాంట్ ఉంది. ఇక్కడి నుంచే భారత్ లాంటి ఇతర దేశాలకు గ్యాస్ ఎగుమతి అవుతుంది. ఇరాన్ చేసిన దాడిలో ఈ ప్లాంట్ దెబ్బతిన్నది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగటంతో గ్యాస్ ప్లాంట్ నుంచి మళ్లీ గ్యాస్ ఎగుమతి కోసం మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పేలుడు జరిగింది. గల్లంతు అయిన 18 మంది బతికి ఉన్నారా లేదా అనేది కలకలం రేపుతోంది.