అతనికి జలచరాలంటే ఇష్టం. చిన్నప్పుడు దొరికినప్పుడల్లా అక్వేరియంలో చేపలతో ఆడుకునేవాడు. పెద్దయ్యాక రొయ్యలను పెంచే పనిలో పడ్డాడు మనోజ్. ఉప్పు పట్టి సాగుకు పనికిరాని బీడు భూములు ఎన్నో ఉన్నాయి. వాటిలో రొయ్యలు పెంచుతూ రూ. కోట్లు సంపాదిస్తున్నాడు. అంతేకాదు.. ఎంతోమంది రైతులకు, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి మార్గదర్శిగా నిలిచాడు.
డాక్టర్ మనోజ్ శర్మది మహారాష్ట్రలోని చిన్నప్పటినుంచి అతనికి సముద్రంలో రంగురంగుల చేపలన్నా, ఇతర జీవులన్నా చాలా ఇష్టం. అందుకే గాజు బాటిళ్లలో చేపలు పెంచేవాడు. రోజూ వాటితో ఆడుకునేవాడు. అవి నీళ్లలో ఈదుతుంటే గంటల తరబడి చూసేవాడు. మనోజ్ 1990లో ఇంటర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అందరిలాగే అతను కూడా మంచి ఉద్యోగం కోసం మెడిసిన్ లేదా సివిల్ సర్వీసెస్లో చేరాలి అనుకున్నాడు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. కానీ.. మంచి స్కోర్ చేయలేకపోయాడు. దాంతో సీటు రాలేదు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన చేపల గురించి మరింత తెలుసుకునేందుకు ఆక్వా కల్చర్ (జలచర సాగు వైపు అడుగులు వేశాడు. ముంబైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ (సీఐఎఫ్ఎస్ఈ)లో చేరి ఆక్వా కల్చర్ మేనేజ్ మెం ట్ మాస్టర్స్ చేశాడు. మనోజ్ 1994లో చదువు పూర్తి చేసుకొని గుజరాత్లోని ఒల్పాడుకు వెళ్లాడు.
సాగు చేయలేని భూమి..
ఒల్పాడ్లో రొయ్యల సాగుకు అనువైన భూములు ఉన్నాయని గుర్తించాడు. కానీ... అప్పట్లో అక్కడ ఆక్వాకల్చర్ పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఒల్పాడ్ నుంచి పక్కనే ఉన్నదండికి వెళ్లాడు. అక్కడ కూడా ఉప్పు శాతం ఎక్కువగా ఉండే భూములు చాలా ఉన్నాయి. వాటిలో పంటలు సరిగ్గా పండవని సాగు చేయకుండా వదిలేశారు. ఆ భూముల్లో చెరువులు తవ్వించి రొయ్యలను పెంచాలని నిర్ణయించుకున్నాడు మనోజ్. అక్కడ అప్పటివరకు రొయ్యల పెంపకం ఎవరూ చేయలేదు. పైగా ఆ రాష్ట్రంలో చాలామంది శాకాహారులే. కాబట్టి వాటికి పెద్దగా డిమాండ్ ఉండదు. అయినా.. అక్కడి సర్పంచ్ ప్రదీప్ నావిక్ సాయంతో ప్రయోగాలు చేశాడు. మొదట్లో వైరల్ వ్యాధులు, చట్టపరమైన సమస్యల వల్ల నష్టాలు వచ్చాయి. కానీ, మనోజ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా పట్టు వదలకుండా సాగు విస్తీర్ణం పెంచాడు.
మొదటి రైతు..
2005 నాటికి రొయ్యల సాగు విస్తీర్ణం 4 హెక్టార్లకు పెరిగింది. మొదట్లో రోడ్డు పక్కన నిలబడి వాటిని అమ్మేవాడు. కొన్నాళ్లకు రొయ్యలకు డిమాండ్ పెరిగింది. దాంతో "మయంక్ ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు సాగు విస్తీర్ణం 400 హెక్టార్లకు పెరిగింది. చుట్టు పక్కల రైతుల సాయంతో సంవత్సరానికి దాదాపు 1,000 టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేస్తున్నాడు. కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.75 నుంచి 100 కోట్ల వరకు వస్తోంది. సూరత్ లోని మరికొంతమంది రైతులతో కలిసి 'సూరత్ ఆక్వాకల్చర్ ఫార్మర్స్ అసోసియేషన్' (ఎస్ఎఫ్ఎ) స్థాపించాడు. ఇప్పుడు అది 500 మందికి పైగా రైతులతో పెద్ద నెట్వర్క్ గా మారింది.
మనోజ్ కృషికి గుర్తింపుగా నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు నుంచి బెస్ట్ ప్రింప్ ఫార్మర్ అవార్డు, 2024లో వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ నుంచి గ్లోబల్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవార్డు లాంటివి అందుకున్నాడు. డీడీ నేషనల్ లో వచ్చిన ఒక డాక్యుమెంటరీలో మనోజ్ గుజరాత్లో 'ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ 'గా పేరు పొందాడని చెప్పారు. మనోజ్ వల్లే సూరత్ తీర ప్రాంతాల్లో ఆక్వాకల్చర్ పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. గుజరాతు 1,600 కి.మీ. తీరం ఉంది. కానీ, ఆ ఉప్పు నీటి ప్రాంతంలో కేవలం 2శాతం మాత్రమే రొయ్యలను పెంచుతున్నారు. ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. దాన్ని పూర్తిగా ఉపయోగిస్తే ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి. అలా జరగాలంటే ముందుగా కొన్ని మార్పులు తీసుకురావాలి. రైతులకు విద్యుత్ చార్జీలు అంతటా ఒకేలా ఉండాలి. దాంతో ఖర్చులు తగ్గుతాయి. సమాన అవకాశాలు లభిస్తాయి. దేశీయ మార్కెట్ను ప్రోత్సహించాలి. ఎక్స్పర్ట్స్ మీదే ఆధారపడకుండా స్థానికంగా డిమాండ్ పెంచాలి. రొయ్యల పెంపకాన్ని వ్యవసాయ రంగంలో భాగంగా చేర్చి ఇన్సూరెన్స్, సబ్సిడీలు ఇవ్వాలి. రొయ్యల్లోని పోషక విలువలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటే దేశంలో రొయ్యల పెంపెకం ఇండస్ట్రీ బలపడి, ఉపాధి, ఆహార భద్రత, ఆర్థిక వృద్ధి దోహదపడుతుంది" అని అంటున్నాడు మనోజ్.
