ఐసీసీతో చర్చించకుండానే వరల్డ్కప్‌కి దూరం.. బంగ్లా అధ్యక్షుడి కామెంట్స్ వైరల్

ఐసీసీతో చర్చించకుండానే వరల్డ్కప్‌కి దూరం.. బంగ్లా అధ్యక్షుడి కామెంట్స్ వైరల్

Tamim Iqbal: 2026 టీ20 ప్రపంచకప్ భారత్ సాధించిన చారిత్రాత్మక విజయంతోనే కాకుండా, బంగ్లాదేశ్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన తీరుతోనూ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మతపరమైన ఉద్రిక్తతలతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవ్వడం, చివరికి అది బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్‌కు దూరం చేయడం క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది.

వివాదానికి అసలు కారణం: 
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ తప్పుకోవాల్సి రావడంతో ఈ సమస్య మొదలైంది. భద్రతా కారణాల దృష్ట్యా తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఐసీసీని కోరింది. కానీ, టోర్నీ సమయం దగ్గరపడటంతో ఐసీసీ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఫలితంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

చర్చలకే తావులేకుండా వదులుకున్నాం:  
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్యంతర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. వరల్డ్ కప్ విషయంలో గత బీసీబీ యంత్రాంగం వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైంది కాదు.. ఐసీసీ కొంత వెసులుబాటు ఇచ్చింది, పరిష్కారం కనుగొనే అవకాశం ఉన్నా మనం దానిని సరిగ్గా వినియోగించుకోలేకపోయామని అసహనం వ్యక్తం చేశారు. 

1996– -97 కాలంలో కెన్యాపై గెలిచి వరల్డ్ కప్‌కు అర్హత సాధించడానికి తాము ఎంతలా పోరాడామో గుర్తు చేస్తూ, ఏ చర్చలు లేకుండానే ఒక ప్రపంచకప్‌ను వదులుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని బీసీబీ చీఫ్ తమీమ్ ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జట్టులో ఉన్న కొంతమంది ఆటగాళ్లకు ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉందని గుర్తు చేశారు.

బీసీసీఐ అధ్యక్షుడితో మంచి సబంధాలు:
ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ గురించి బంగ్లా క్రికెట్ బోర్డు చీఫ్ తమీమ్ మాట్లాడుతూ.. తన పాత స్నేహితుడితో ఉన్న సాన్నిహిత్యంపై విశ్వాసం వ్యక్తం చేశారు. మిథున్, నేను ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడాం.. ఆయన ఢాకా లీగ్స్ ఆడటానికి చాలాసార్లు బంగ్లాదేశ్ వచ్చారు.. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, భారత్ ఇక్కడ పర్యటిస్తే స్టేడియాలు కిక్కిరిసిపోతాయని తమీమ్ ఇక్బాల్ ధీమా వ్యక్తం చేశారు.