హైదరాబాద్: తెలంగాణలో ఇద్దరు విద్యార్థినులు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటనలు విషాదం నింపాయి. కన్న వాళ్లను శోకసంద్రంలోకి పడదోసి ఈ ఇద్దరు అమ్మాయిలు కడుపు కోత మిగిల్చి వెళ్లిపోయారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురు నానక్ కాలేజీలో చదువుతున్న బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని మానస (20).. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తాను ఉంటున్న హాస్టల్లో ఉరేసుకుని చనిపోయింది. సొంత ఊరు ఖమ్మం జిల్లా బల్లేపల్లి.
పూజా రెడ్డి అనే పేరుతో ఉన్న ప్రైవేట్ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. లవ్ ఫెయిల్యూర్ కావడం వల్ల చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కానీ దర్యాప్తు తర్వాతే స్పష్టమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో.. అపార్ట్మెంట్పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఈ విషాదం జరిగింది. MBBS పూర్తి చేసి బెంగుళూరులో సిద్ధార్థ కళాశాలలో పీజీ చేస్తున్న దీక్షిత(26) ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. గత వారం బెంగళూరు నుంచి.. నాగారంలోని ఈస్ట్ గాంధీనగర్లో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు దీక్షిత వచ్చింది.
శుక్రవారం సాయంత్రం అపార్ట్మెంట్ పై నుంచి దూకి దీక్షిత చనిపోయింది. దీక్షిత కుటుంబం సొంతూరు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం, మైలారం గ్రామం. నాగారంలో స్థిరపడ్డారు. దీక్షిత తండ్రి ఆనంద్ కుమార్ ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
