ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు: తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు: తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రశ్నే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టమైంది. ప్రజలు తమకు అధికారం అప్పగించారని, ప్రజా తీర్పును గౌరవిస్తామని.. ప్రజల ఆకాంక్షలను తాము నెరవేరుస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మంత్రిని పదవి నుంచి తొలగించడం, మంత్రిని మార్చడంపై కాకుండా.. పరీక్షా విధానాలను సంస్కరించడం, పేపర్ లీక్ రాకెట్ల వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవడం పైనే తమ దృష్టి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

కేంద్ర మంత్రులతో చర్చించిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి మూడు డిమాండ్లతో ఒక లేఖ సమర్పించారు. అందులో మొదటిది.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. రెండోది నీట్ బాధితుల కుటుంబాలకు పరిహారం, మూడో డిమాండ్ నిరసనకారులపై చట్టపరమైన చర్యల నుంచి ఊరట కలిగించేలా కేసుల ఎత్తివేత.. ఈ మూడు డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. మిగిలిన రెండు డిమాండ్లపై సానుకూలంగా ఉంది.

అయితే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే నిరసనలను విరమిస్తామని.. అప్పటి వరకూ నిరసన కొనసాగిస్తామని CJP తేల్చి చెప్పింది. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనలకు ఎలా చెక్ పెడుతుందనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

NEET పేపర్ లీక్, దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో వెలుగుచూసిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ, Gen-Z ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రోజుల తరబడి నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.