Gen-Zకి పోటీగా రీల్స్ చేయండి.. ప్రచారం చేయండి: మంత్రులతో ప్రధాని మోదీ

Gen-Zకి పోటీగా రీల్స్ చేయండి.. ప్రచారం చేయండి: మంత్రులతో ప్రధాని మోదీ

ఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జెన్ జెడ్ యువత చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులకు కీలక సూచన చేశారు. మంత్రులందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని కేంద్ర మంత్రులకు మంత్రివర్గ సమావేశంలో ప్రధాని సూచించారు.

యువత ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, మంత్రులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ యువతతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలని ప్రధాని మంత్రులకు హిత బోధ చేశారు.

ప్రతీ మంత్రి రీల్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయాలని, ఇంటరాక్టివ్ కంటెంట్‌ రీల్లో ఉండాలని ప్రధాని వివరించారు. మంత్రులకు ఈ సూచన చేసిన ప్రధాని మోదీ కొన్ని గంటల ముందే రీల్ ఫార్మాట్ వీడియోను ఆయన తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా అకౌంట్లన్నింటిలో ఈ షార్ట్ వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

Gen-Zలతో సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ మార్గమని ప్రధాని మోదీ గ్రహించారు. జంతర్ మంతర్ దగ్గర నిరసనలకు సంబంధించి లక్షల వీడియోలు ఇన్ స్టాగ్రాంలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై ఇంత పెద్ద ఎత్తున Gen-Zలు ఉద్యమించడానికి వారందరికీ ఒక కామన్ ఫ్లాట్ ఫామ్గా Instagram నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.

అందుకే.. యువతకు వారి మార్గంలోనే దగ్గరవ్వాలని ప్రధాని మోదీ మంత్రులకు కీలక సూచన చేయడం గమనార్హం. ఎంత మంది కేంద్ర మంత్రులు ఇన్ స్టాగ్రాంలో యాక్టివ్గా ఉంటున్నారనే విషయం కూడా ప్రధాని మోదీ ఆరా తీశారు.