చెన్నై: అసెంబ్లీలో బల పరీక్షకు ముందు టీవీకే చీఫ్, సీఎం విజయ్‌కు భారీ ఊరట దక్కింది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల వర్గం టీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఫ్లోర్ టెస్ట్‌లో విజయ్‌కు భేషరతుగా సపోర్ట్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో బుధవారం (మే 13) అసెంబ్లీలో జరగనున్న ఫ్లోర్ టెస్ట్‌లో విజయ్ సునాయాసంగా గట్టెక్కనున్నారు.
మంగళవారం (మే 12) అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలు సీవీ. షణ్ముగం, ఎస్పీ వేలుమణిలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా బల పరీక్షలో మద్దతు, పదవుల గురించి డిస్కస్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా బల పరీక్షలో విజయ్‌కు మద్దతు ఇస్తామని సీవీ. షణ్ముగం, ఎస్పీ వేలుమణి హామీ ఇచ్చారు. అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గానికి దాదాపు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
వీరంతా అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షలో విజయ్‌కు మద్దతు ప్రకటించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న పార్టీలతో కలుపుకుని టీవీకేకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు)కు కేవలం రెండు సీట్లు మాత్రమే ఎక్కువ. దీంతో బలపరీక్షలో ఎవరైనా హ్యాండ్ ఇస్తే విజయ్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది.
ఈ నేపథ్యంలోనే ఫ్లోర్ టెస్ట్‌లో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముందు నుంచే విజయ్ చక్రం తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే రెబల్ వర్గంతో చర్చలు జరిపి మద్దతు కోరాడు. ఇందు వాళ్లు కూడా అంగీకరించడంతో ఫ్లోర్ టెస్ట్‌లో విజయ్ సునాయాసంగా తన బలం నిరూపించుకోనున్నాడు.
అన్నాడీఎంకేలో చీలిక ఎందుకు..?
2026 తమిళనాడు అసెంబ్లీకల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 మంది స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు ఇతర పక్షాల మద్దతు అవసరమైంది. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకేలోని షణ్ముగం వర్గం డిమాండ్ చేసింది. ఇందుకు పార్టీ చీఫ్ పళనిస్వామి వర్గం ఒప్పుకోలేదు. దీంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది.
షణ్ముగం వర్గం విజయ్ కు మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో బలపరీక్షకు ముందు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. 2026, మే 13 లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని విజయ్‌కు గవర్నర్ డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఇతర చిన్నా పార్టీల మద్దతుతో టీవీకే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ (118) రీచ్ కాగా.. అన్నాడీఎంకే 30 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల సపోర్ట్‌తో ఫ్లోర్ టెస్ట్‌లో విజయ్ ఈజీగా పాస్ కానున్నారు.
