చెన్నై: తమిళనాడు సీఎం, టీవీకే చీఫ్ విజయ్ నిర్ణయం వివాదస్పదంగా మారింది. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీవీకే మిత్రపక్షాలు కూడా సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. తమది సెక్యులర్ ప్రభుత్వమని గొప్పగా ప్రకటించిన విజయ్ తన పార్టీకి మద్దతుగా మాట్లాడే ఓ జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టడం ఏంటని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
ఈ అంశంపై టీవీకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశికాంత్ సెంథిల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఒక జ్యోతిష్యుడిని సీఎం రాజకీయ సలహాదారుడిగా నియమించుకోవడం ఏంటీ.. ఇది నాకేమి అర్ధం కావడం లేదు.. దీనిని ఎవరైనా వివరించగలరా అంటూ విజయ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ నియామకంపై వీసీకే ప్రధాన కార్యదర్శి డి. రవికుమార్ స్పందిస్తూ..
లౌకిక ప్రభుత్వంలో ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. సీఎం విజయ్ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని సూచించారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి.షణ్ముగం కూడా సీఎం విజయ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రభుత్వ కర్తవ్యం. కానీ ముఖ్యమంత్రి రాజకీయ విభాగం కార్యదర్శిగా నియమితులైన రాధన్ పండిట్ ఒక జ్యోతిష్యుడు.
రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ అశాస్త్రీయ నియామకాన్ని తమిళనాడు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం చేసిన ఈ నియామకం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. అతను రాజకీయ సలహాలు ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదు’’ అని పేర్కొన్నారు. రాధా పండిట్ నియామకంపై ఇంటాబయటా విమర్శలు వస్తుండటంతో ఈ ఇష్యూని సీఎం విజయ్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది.
ఇంతకీ ఎవరీ రాధా పండిట్..?
రాధా పండిట్. తమిళనాడులో జ్యోతిష్యుడుగా గుర్తింపు పొందారు. రాజకీయాలతో బాగా లింక్ అయ్యి ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఏ పార్టీ గెలుస్తుంది.. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు అనే విషయాలపై జ్యోతిష్యం చెబుతుంటారు. నటుడిగా విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి.. టీవీకే పార్టీ పేరు పెట్టినప్పటి నుంచి.. తమిళనాడు రాజకీయాలపై జ్యోతిష్యం చెబుతూ వస్తున్నారు.
ఎన్నికల్లో విజయ్ విజయం సాధిస్తారని.. తమిళనాడుకు విజయ్ సీఎం అవుతారని ఏడాది కాలంగా చెబుతూ వస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతాయని.. విజయ్ రాకతో మొత్తం మారిపోతుందని చెబుతూ వస్తున్నారు. ఆయన చెప్పినట్లే అంతా జరిగింది. విజయ్ సీఎం అయ్యారు.
ఆయన మరో విషయం కూడా చెప్పారు.. విజయ్ జాతకం సునామీ లాంటిదని.. అందర్నీ తుడిచిపెట్టేస్తుందని.. ఆయన జాతకంలో రాజయోగం ఉందని బల్లగుద్ది మరీ మరీ చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే జరిగిందని తమిళనాడు జనం నమ్ముతూ వస్తున్నారు.
ఎన్నికల్లో విజయ్ గెలిచిన తర్వాత.. రాధా పండిట్ విజయ్ ఇంటికి వచ్చారు. సుదీర్ఘంగా చర్చించారు. విజయ్ ప్రమాణ స్వీకారం రోజున ఆయన హాజరయ్యారు. విజయ్ తో వ్యక్తిగతంగా ఆయన మంచి పరిచయం ఉందని.. చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా జ్యోతిష్యుడు రాధా పండిట్ ఏకంగా సీఎం విజయ్ OSDగా నియామకం అవ్వటం చర్చనీయాంశం అయ్యింది.
