Hardik Pandya: ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత దారుణమైన ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మ లాంటి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ను పక్కన పెట్టి గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను భారీ డీల్ కి తెచ్చుకున్న ముంబైకి ఆ నిర్ణయం కొంచెం కూడా కలిసిరాలేదు.. ప్రసెంట్ సీజన్లో ముంబై ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడమే కాకుండా వరుస ఓటములతో చెత్త రికార్డులను మూటగట్టుకుంటుంది. దీంతో హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలని క్రీడా పండితులు, సోషల్ మీడియాలో డిమాండ్ వస్తుంది.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇవ్వాలని కోరారు. బుమ్రాకు ఆటపై ఉన్న అవగాహన, బ్యాటర్ల మైండ్‌సెట్‌ను ముందే రీడ్ చేయగల చాకచక్యం, పిచ్ పరిస్థితులపై ఉన్న పట్టు అతడిని ఒక అద్భుతమైన నాయకుడిగా మారుస్తుందని సంజయ్ పేర్కొన్నారు. టెస్టు కెప్టెన్సీతో పోలిస్తే ఐపీఎల్ ఫార్మాట్ బుమ్రాకు సమస్య కాదని.. అతడు తన తెలివితేటలతో జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాడని ముంజ్రేకర్ నమ్మకం వ్యక్తం చేశారు.
హార్దిక్ పాండ్యా వైఫల్యంపై సంజయ్ ముంజ్రేకర్ విశ్లేషిస్తూ.. గతంలో హార్దిక్, ఆశిష్ నెహ్రా జోడి గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిందన్నాడు. హార్దిక్‌ను ముంబై తీసుకువచ్చేటప్పుడే నెహ్రాను కూడా కోచ్‌గా నియమించుకోవాల్సింది.. అది ఒక 'ప్యాకేజీ డీల్' లాంటిదని వెల్లడించాడు. ఇప్పుడు నెహ్రా లాంటి మార్గదర్శి లేకపోవడంతోనే హార్దిక్ కెప్టెన్సీలో తడబడుతున్నాడు.. ముంబై చేసిన ఈ ప్రయోగం పూర్తిగా ఫెయిల్ అయిందని సంజయ్ తేల్చి చెప్పాడు.
మరోవైపు ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడిపోవడంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. అలాగే జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా హార్దిక్ జట్టు సభ్యులతో కలిసి రాయ్‌పూర్‌కు వెళ్లకపోవడంతో ఈ అనుమానాలకు తావు తీసింది. ఓ వైపు ఫ్యాన్స్ రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్ చేయాలని డిమాండ్ చేస్తుండగా, నిపుణులు మాత్రం బుమ్రాకి సారథ్య బాధ్యతలు ఇవ్వాలని సూచిస్తున్నారు. రాబోయే సీజన్ లోనైనా ముంబై తన నాయకత్వ విభాగంలో ప్రక్షాళన చేస్తుందో లేదో చూడాలి.
