LPG కస్టమర్లకు అలర్ట్: 7 రోజుల్లో స్పందించకపోతే మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రద్దు! కొత్త రూల్స్ ఇవే

LPG కస్టమర్లకు అలర్ట్: 7 రోజుల్లో స్పందించకపోతే మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రద్దు! కొత్త రూల్స్ ఇవే

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీ సిలిండర్ల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ధరలు, దేశ ఆర్థిక లోటును దృష్టిలో ఉంచుకుని.. అనర్హులైన వారికి సబ్సిడీని నిలిపివేయాలని డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా అధిక ఆదాయం ఉన్నప్పటికీ సబ్సిడీ పొందుతున్న వారిని గుర్తించే ప్రక్రియను స్పీడప్ చేసింది. ఈ క్రమంలోనే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆదాయపు పన్ను శాఖ నుంచి డేటాను తీసుకుని అనర్హులను ఏరివేసే పనిలో ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఎవరికైతే ఏడాదికి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటుందో.. వారికి గ్యాస్ సబ్సిడీని నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సంపన్న వర్గాలకు ఇచ్చే ఈ రాయితీని తగ్గించి, ఆ నిధులను పేద ప్రజల సంక్షేమం కోసం, దేశ ఇంధన భద్రత కోసం వినియోగించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఇప్పటికే దేశంలోని ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థలు ఆదాయ పరిమితి దాటిన వినియోగదారుల ఫోన్లకు మెసేజ్‌లు పంపడం ప్రారంభించాయి.

►ALSO READ | హీటెక్కిన క్విక్ కామర్స్ వార్.. బ్లింకిట్, జెప్టోలను వెంటాడుతున్న అమెజాన్ నౌ

మీ మొబైల్ ఇన్బాక్స్‌కు కూడా ఇలాంటి సందేశం వస్తే జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీ ఆదాయం పైన చెప్పిన పరిమితి లోపు ఉండి కూడా సబ్సిడీ నిలిపివేసినట్లు మెసేజ్ వస్తే.. మీరు దానిపై అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. మెసేజ్ అందిన 7 రోజుల్లోపు కంపెనీల టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లకు లేదా అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. నిర్ణీత సమయంలో స్పందించకపోతే.. మీ సబ్సిడీ శాశ్వతంగా నిలిపివేయబడుతుంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో విదేశీ మారక నిల్వలపై భారం పడుతోంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని కొన్ని వారాలుగా కంపెనీలు ఆపేసిన సంగతి తెలిసిందే. సిలిండర్ బుకింగ్ గ్యాప్‌ను పెంచటం వంటి చర్యలు ఇప్పటికే అమలౌతున్నాయి. అంతేకాకుండా డాలర్ నిల్వలను ఆదా చేసేందుకు బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటి అనవసర వస్తువుల దిగుమతులపై కూడా ఆంక్షలు విధించే దిశగా ప్రధాని కార్యాలయం, ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనికి హింట్ గానే ఆదివారం రోజున ప్రధాని మోడీ తన ప్రసంగంలో కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు.