దేశంలో ఇ-కామర్స్ అంటే ఒకప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. 10 నిమిషాల్లో కిరాణా సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ కోరుకున్న వస్తువులు ఇంటి గుమ్మం దగ్గరకే డెలివరీ చేసే క్విక్ కామర్స్ యాప్స్ హవా దూసుకుపోతోంది. ఈ రేసులో ఇన్నాళ్లూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అమెజాన్.. ఇప్పుడు 'అమెజాన్ నౌ' పేరుతో యుద్ధ క్షేత్రంలోకి దూకింది. ఇది కేవలం ప్రయోగం కాదు.. ఉనికిని కాపాడుకునే పోరాటం. నిన్న మెున్నటి వరకూ రూ.200 కొంటే రూ.100 క్యాష్ బ్యాక్ ఇచ్చిన అమెజాన్ నౌ ఇప్పుడు రూ.400 కొనుగోలుపే రూ.50, రూ.799 కొనుగోలుపై రూ.100 తిరిగి వాలెట్లలోకి తిరిగి యాడ్ చేస్తూ దూకుడు పెంచేసింది.
అమెజాన్ అసలు వ్యూహం ఇదే:
క్విక్ కామర్స్ మొదట్లో కేవలం పాలు, కూరగాయలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ అంటూ ప్రతి ఒక్కటీ 10 నిమిషాల్లో వస్తుండటంతో అమెజాన్ ప్రధాన వ్యాపారానికి ముప్పు ఏర్పడింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని అమెజాన్ ప్రైమ్ కస్టమర్లు బ్లింకిట్, జెప్టో వైపు మళ్లుతున్నారు. ఇండియాలో ఉన్న 30-35 మిలియన్ల ప్రైమ్ మెంబర్లను కాపాడుకోవాలనే ప్లాన్ తో అమెజాన్ నౌ వేగంగా విస్తరిస్తోంది. ఒకసారి ఈ సేవలు వాడటం మొదలుపెడితే, కస్టమర్లు షాపింగ్ చేసే ఫ్రీక్వెన్సీ 3 రెట్లు పెరుగుతోందని అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ చెప్పారు.
భారీ పెట్టుబడి.. మెరుపు వేగంతో విస్తరణ
అమెజాన్ తన క్విక్ కామర్స్ వ్యాపారం కోసం ఏకంగా రూ.2వేల 800 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ప్రస్తుతం 450-500 డార్క్ స్టోర్ల ద్వారా రోజుకు 3-3.5 లక్షల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది. అయితే ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో 100 నగరాలకు విస్తరించాలని.. వెయ్యి మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అమెజాన్ టార్గెట్ గా పెట్టుకుంది.
కంపెనీల మధ్య పోటీ ఎలా ఉంది?
క్విక్ కామర్స్ మార్కెట్‌లో ప్రస్తుతానికి జొమాటోకి చెందిన బ్లింకిట్ తిరుగులేని రారాజుగా ఉంది. మార్కెట్ అంచనాల ప్రకారం వివిధ కంపెనీల పరిస్థితి ఇలా ఉంది:
1. బ్లింకిట్: రోజుకు 30 లక్షల ఆర్డర్లను 2,243 స్టోర్ల ద్వారా నిర్వహిస్తోంది.
2. జెప్టో: రోజుకు 15-16 లక్షల ఆర్డర్లను 1,200-1,300 స్టోర్ల నుంచి ప్రాసెస్ చేస్తోంది.
3. స్విగ్గీ ఇన్స్టామార్ట్: రోజుకు 12 లక్షల ఆర్డర్లను1,136 స్టోర్ల నుంచి పూర్తి చేస్తోంది.
4. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్: రోజుకు 7.5-8 లక్షల ఆర్డర్లను తన 800 స్టోర్ల ద్వారా నిర్వహిస్తోంది.
5. అమెజాన్ నౌ: రోజుకు 3-3.5 లక్షల ఆర్డర్లు 500 స్టోర్ల నుంచి హ్యాండిల్ చేస్తోంది.
అమెజాన్ ముందున్న సవాళ్లు:
అమెజాన్ దగ్గర భారీగా డబ్బు ఉన్నప్పటికీ.. ఆపరేషన్ల పరంగా ఇంకా వెనకబడే ఉంది. బ్లింకిట్ ఒక స్టోర్ నుంచి రోజుకు 1,300 ఆర్డర్లు సాధిస్తుంటే.. అమెజాన్ కేవలం 600-700 ఆర్డర్లకే పరిమితమైంది. అలాగే అమెజాన్ సగటు ఆర్డర్ విలువ రూ.300 కంటే తక్కువగా ఉంది. అదే బ్లింకిట్ విషయంలో అది రూ.525గా ఉంది. అంటే కస్టమర్లు అమెజాన్‌లో చిన్న చిన్న వస్తువులనే ఆర్డర్ చేస్తున్నారు ప్రస్తుతం. దీనికి తోడు అమెజాన్ భారీ డిస్కౌంట్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇది దీర్ఘకాలంలో ఎంతవరకు లాభదాయకమో చూడాల్సిందే మరి.
క్విక్ కామర్స్ అనేది కేవలం వేగంగా వస్తువులను చేరవేయడం మాత్రమే కాదు.. దాని వెనుక కనిపించకుండా ఒక సంక్లిష్టమైన సప్లై చైన్ గేమ్ ఉంటుంది. అమెజాన్ ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ.. దాని దగ్గర ఉన్న డేటా, లాజిస్టిక్స్ అనుభవానికి తోడుగా ఆర్థిక బలం మార్కెట్ షేర్‌ను లాగేసుకునేలా చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెుత్తానికి ఇప్పుడే చేయాలి లేదంటే ఇంకెప్పటికీ చేయలేం అన్న రీతిలో అమెజాన్ వేస్తున్న అడుగులు చూస్తుంటే.. ఇండియాలో డెలివరీ వార్ వచ్చే ఏడాది మరిన్ని మలుపులు తప్పవని తెలుస్తోంది.
