ప్రధాని మోడీ హైదరాబాద్ సమావేశంలో దేశ ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలంటూ అనేక సూచలను చేసారు. ఈ క్రమంలో బంగారం కొనుగోలు నుంచి పెట్రోల్ వాడకం వరకూ అనేక అంశాలను ప్రస్థావించారు. ఈ ప్రసంగం భారతీయ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. మోడీ మాటలతో ఆయా రంగాలు ప్రస్తుతం మార్కెట్లో అమ్మకాల ఒత్తిడితో చిత్తవుతున్నాయి. మెుత్తంగా ప్రధాని వ్యాఖ్యలు దేశీయ ఇన్వెస్టర్ల సంపదను దాదాపు రూ.6 లక్షల కోట్ల మేర ఆవిరి చేసాయి.
సోమవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా అదే జోరుతో బేజారాయి. దీంతో ఉదయం 10.16 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 596 పాయింట్లు, నిఫ్టీ 155 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 181 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 360 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఐటీ రంగానికి చెందిన షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడితో కొనసాగుతూ సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. దీనికి తోడు ఈరోజు మన స్టాక్ మార్కెట్లను నష్టాల దిశగా నడిపిస్తున్న ఇతర కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పెరుగుతున్న ముడి చమురు ధరలు:
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగి బ్యారెల్‌కు 105 డాలర్ల మార్కును తాకాయి. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న ఇండియాకు ఇది ప్రతికూల అంశం. చమురు ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, దేశంలో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ఇది కంపెనీల ఆదాయాలపై భారాన్ని పెంచడమే కాకుండా, దేశ ఆర్థిక వృద్ధిని మందగించేలా చేస్తుంది.
2. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇరాన్ ప్రతిపాదనలను తప్పుబట్టడమే కాకుండా.. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం "లైఫ్ సపోర్ట్" మీద ఉందని అన్నారు. ఇటువంటి రాజకీయ అనిశ్చితి ప్రపంచ వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతూ దేశీయంగానూ ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీస్తోంది.
3. ఇండియా విక్స్:
స్టాక్ మార్కెట్‌లో భయాన్ని సూచించే ఓలటాలిటీ ఇండెక్స్ 18.56 స్థాయికి చేరుకుంది. ఇది మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితిని, ఒడిదుడుకులను సూచిస్తుంది. సూచీ పెరగడం అంటే పెట్టుబడిదారులలో ఆందోళన పెరుగుతోందని అర్థం.
