తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ రోజు( మే 12, 2026 ) తెలంగాణ సినీ ఎగ్జిబిటర్ల సంఘం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో మల్టీప్లెక్స్ ల తరహాలో సింగిల్ స్క్రీన్స్ లకు పర్సంటేజ్ విధానం అమలు, సినిమాల రన్ టైం, నష్టాలను, లాభాలను సరి సమానంగా పంచుకొనే విధానం వంటి అంశాలపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు ఒక అల్టిమేటం జారీ చేశారు. పాత అద్దె విధానానికి స్వస్తి పలికి, తక్షణమే పర్సంటేజ్ షేరింగ్ విధానాన్ని అమలు చేయకపోతే థియేటర్లను మూసివేయడం మినహా మరో మార్గం లేదని తెగేసి చెప్పారు.
అప్పులపాలవుతున్న ఎగ్జిబిటర్లు..
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిర్మాతకు ఎగ్జిబిటర్ బిడ్డతో సమానం. సింగిల్ స్క్రీన్స్ అనేవి ఇండస్ట్రీకి బిర్యానీ లాంటివి, మల్టీప్లెక్స్‌లు కేవలం ఆవకాయ్ మాత్రమే అంటూ కామెంట్స్ చేశారు. సినిమా హిట్టా ఫ్లాపా అన్నదానితో సంబంధం లేకుండా భారీ అద్దెలు వసూలు చేయడం ఎగ్జిబిటర్లకు ఉరితాడులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్ భారమై యజమానులు అప్పులపాలవుతున్నారు అని పేర్కొన్నారు..
ఆ 10 వారాల గండం!
చిన్న సినిమాలకు ఏడాదిలో 40 వారాల పాటు పర్సంటేజ్ విధానాన్ని ఒప్పుకుంటున్న నిర్మాతలు, పండుగ సీజన్లలో వచ్చే స్టార్ హీరోల సినిమాలకు మాత్రం భారీ అద్దెలు డిమాండ్ చేస్తున్నారు. ‘పుష్ప’ వంటి భారీ చిత్రాలు కూడా కేవలం 2-3 వారాల్లోనే రన్ ముగించేస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో ‘పుష్ప’ లాంటి పాన్ ఇండియా సినిమాలకు పర్సంటేజ్ ఇస్తూ, మన తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వకపోవడంపై ఎగ్జిబిటర్ల సంఘం మండిపడింది.
మల్టీప్లెక్స్ రూల్ మాకూ కావాలి!
కార్పొరేట్ మల్టీప్లెక్స్‌లకు ఇచ్చే పర్సంటేజ్ గౌరవం, సింగిల్ స్క్రీన్స్‌కు ఎందుకు ఇవ్వరని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. లాభనష్టాలను సమానంగా పంచుకునే ‘రిస్క్ అండ్ రివార్డ్’ పాలసీ వస్తేనే ఇండస్ట్రీ బతుకుతుంది. ఓటీటీల కాలంలో సింగిల్ స్క్రీన్ మ్యాజిక్‌ను కాపాడుకోవడానికి స్టార్ హీరోలు, బడా నిర్మాతలు పెద్ద మనసుతో స్పందించాలని, లేదంటే టాలీవుడ్ బాక్సాఫీస్ మూగబోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మరి ఇండస్ట్రీ పెద్దలు ఈ క్రైసిస్‌ను ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.
