కరెంట్ బిల్లు తెచ్చిన తంటా.. ఒకే ఒక్క ఫ్లాట్ లో 309 కొండచిలువలు! బాబోయ్ పాముల సామ్రాజ్యం...

కరెంట్ బిల్లు తెచ్చిన తంటా.. ఒకే ఒక్క ఫ్లాట్ లో 309 కొండచిలువలు! బాబోయ్ పాముల సామ్రాజ్యం...

మీ పక్కింటి నుండో, పై ఫ్లాట్ నుంచో రోజూ ఎవరో ఒకరు రావడం, పోవడం కనిపిస్తుంటే ఏమనుకుంటారు ? మహా అయితే చుట్టాలు అనుకుంటారు. కానీ చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న బిజినెస్ తెలిస్తే మాత్రం గుండె గుభేల్ అనాల్సిందే. ఎందుకంటే ఆ ఫ్లాట్ లో మనుషులు కాదు.. ఏకంగా 309 కొండచిలువలు కాపురం ఉంటున్నాయి. ఇదొక  ఒక వింత సంఘటన, ఒక చిన్న కరెంట్ బిల్లు ఆధారంగా పోలీసులు ఈ భారీ పాముల గుట్టును ఎలా రట్టు చేశారో తెలిస్తే అవాక్కవుతారు.

కొండపై దొరికిన క్లూ..  
2024 మార్చిలో ఒక రోజు.. ఒక కొండ కింద నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడికి ఒక పెద్ద కొండచిలువ కనిపించింది. సాధారణంగా  చలికాలంలో పాములు బయట తిరగవు, నిద్రాణస్థితి (హైబర్నేషన్)లో ఉంటాయి. అలాంటి టైంలో ఇంత పెద్ద పాము బయట తిరగడం చూసి అక్కడి వైల్డ్ లైఫ్ అధికారులకు, పోలీసులకు అనుమానం వచ్చింది. 'ఇది కచ్చితంగా ఎవరో ఇంట్లో పెంచుకుంటుంటే తప్పించుకుని వచ్చి ఉంటుంది' అని డిసైడ్ అయ్యారు. కానీ ఆ అడవి లాంటి ప్రాంతంలో దాన్ని పెంచినోడిని పట్టుకోవడం ఎలా ?

పోలీసులకు మైండ్ బ్లాక్ 
ఈ కేసులో పోలీసులకు ఒక సరీసృపాల నిపుణుడు (Reptile Expert) ఇచ్చిన సలహానే టర్నింగ్ పాయింట్. కొండచిలువలు బతకాలన్నా, పిల్లలు పెట్టాలన్నా ఏడాది పొడవునా గదిలో బాగా వేడిగా, తేమగా ఉండే వాతావరణం కావాలి. అలా ఏసీలు, హీటర్లు నిరంతరం వాడటం వల్ల ఆ ఇంట్లో 'కరెంట్ బిల్లు' అసాధారణంగా చాలా ఎక్కువగా వస్తుంది. ఆ రూట్లో వెతకండి అని హింట్ ఇచ్చాడు. ఇంకేముంది.. పోలీసులు రంగంలోకి దిగి ఆ ఏరియాలో విపరీతంగా కరెంట్ వాడుతున్న ఇళ్ల లిస్ట్ తీశారు. అలా 'గ్వో' అనే వ్యక్తి ఫ్లాట్ పై అనుమానం వచ్చింది.

తెల్ల ఎలుకల పార్సిళ్లు.. 
పోలీసులు గ్వో ఇంటిపై నిఘా పెట్టారు. ఆ గ్వో ఇంటికి 'డి' అనే మరో వ్యక్తి తరచూ రావడం గమనించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ వ్యక్తి ప్రతిరోజూ ఆ అపార్ట్‌మెంట్‌కు వందల సంఖ్యలో 'తెల్ల ఎలుకలు' ఉన్న పార్సిళ్లను తీసుకొస్తున్నాడు. దీనికి తోడు గ్వో సోషల్ మీడియా అకౌంట్స్‌ను చెక్ చేయగా.. వాడు రకరకాల పాములను చూపిస్తూ ప్రైవేట్ సేల్స్ చేస్తున్నట్లు కొన్ని హింట్స్ దొరికాయి. పక్కా ఆధారాలు దొరకడంతో పోలీసులు ఒక్కసారిగా గ్వో అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడి దృశ్యం చూసి ఫ్యూజులు అవుట్ అయ్యాయి.

బెడ్‌రూమ్, హాల్ అంతా పాములే
ఆ ఫ్లాట్‌లో మనుషులు ఉండేందుకే చోటు లేదు. గ్వో తన సామాన్లన్నింటినీ ఒకే ఒక్క చిన్న బెడ్‌రూమ్‌లోకి నెట్టేసి.. మిగిలిన బెడ్‌రూమ్‌లు, హాల్, వంటగది ఇలా ప్రతి అంగుళాన్ని పాముల ఫామ్‌గా మార్చేశాడు. వందలాది ప్లాస్టిక్ డబ్బాలను ఒకదానిపై ఒకటి పేర్చి, ప్రతి డబ్బాలోనూ ఒక్కో కొండచిలువను పెట్టాడు. మొత్తం లెక్కబెడితే 309 కొండచిలువలు తేలాయి. వాటన్నింటినీ స్వాధీనం చేసుకుని లోకల్ జూకి తరలించారు.

నేను పాముల సృష్టికర్తను
పోలీసుల విచారణలో గ్వో చెప్పిన విషయాలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి. తనకు చిన్నప్పటి నుండి పామంటే పిచ్చి అని, 2014లో కేవలం నాలుగు కొండచిలువలతో ఈ ప్రయాణం మొదలుపెట్టానని చెప్పాడు. ఇలా మెల్లిమెల్లిగా వాటికి బ్రీడింగ్ చేయడం సొంతంగా నేర్చుకున్నాడట. రకరకాల రంగులు, డిజైన్లు ఉండే పాము పిల్లలను పుట్టించడంలో తను ఎక్స్‌పర్ట్ అయిపోయానని.. అందుకే తనను తాను ఒక సృష్టికర్త (Creator) గా భావిస్తానని గర్వంగా చెప్పుకొచ్చాడు.

ఇప్పటివరకు వీళ్లు సుమారు 80 కొండచిలువలను గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లకు పదేళ్ల క్రితం మొదటి పామును సప్లై చేసిన మరో దుకాణదారుడి ఇంట సోదాలు చేయగా.. అక్కడ కూడా మరో 47 కొండచిలువలు దొరికాయి. మొత్తానికి ఒక చిన్న పాము, ఒక కరెంట్ బిల్లు కలిసి చైనాలోనే అతిపెద్ద అక్రమ పాముల సామ్రాజ్యాన్ని బట్టబయలు చేశాయి.