హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి IDES (2012 బ్యాచ్)ని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. అజిత్ రెడ్డి ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా కొనసాగుతుండగా.. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ (Addl. MD - FAC) గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ దశలో అనుభవజ్ఞుడైన అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రాజెక్టు నిర్ణయాల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. అజిత్ రెడ్డి ఇప్పటికే ఇన్వెస్ట్ తెలంగాణ బాధ్యతల్లో ఉండటం వల్ల, మెట్రో విస్తరణకు అవసరమైన పెట్టుబడులు, పారిశ్రామిక అనుసంధానాలను మెరుగుపరచడంలో ఈ నియామకం కీలక పాత్ర పోషిస్తుంది.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నగర రవాణా వ్యవస్థకు వెన్నెముక వంటిది. దీనిని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం,మెట్రో ప్రాజెక్టుల వేగాన్ని మరింత పెంచేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
