భువనేశ్వర్: సాధారణంగా పామును చూస్తేనే జనం జంకుతారు. భయంతో దూరంగా పరిగెడతారు. అలాంటిది ఒకే చోట 30 పాములు కనిపిస్తే.. మళ్లీ అవి కూడా ప్రమాదకరమైన నాగు పాములు అయితే.. పరిస్థితి ఎలాంటి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. దాదాపు గుండె ఆగినంత పని అయితుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒడిషాలో వెలుగు చూసింది. వెలగ చెట్టు కింద ఏకంగా 30 నాగు పాము పిల్లలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మయూర్‌భంజ్ జిల్లాలోని అత్‌షిల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉన్న వెలగ (బేల్) చెట్టు దగ్గర పెద్ద నాగుపామును చూశాడు. పాముతో పాటు దాని పిల్లల గుంపును గమనించాడు. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అటవీ శాఖకు చెందిన పాముల రక్షకుడు కృష్ణ చంద్ర గోచ్ఛాయత్ సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టు కింద ప్రాంతంలో తవ్వారు. అప్పుడే పొదిగిన నాగుపాము పిల్లలు ఉన్న ఒక గూడును ఆయన కనుగొన్నారు. అందులో సుమారు 25 నుంచి 30 వరకు ఉన్న నాగుపాము పిల్లల గుంపు కనిపించింది. పాము పిల్లలను రక్షించి సమీపంలోని అడవిలోకి వదిలివేశారు.
ALSO READ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఏరియాలో చిరుత పులి లేదు
ఈ సందర్భంగా కృష్ణ చంద్ర గోచ్ఛాయత్ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం (జూన్ 27) మధ్యాహ్నం 2 గంటలకు అత్‌షిల్ గ్రామం నుంచి ఒక కాల్ వచ్చింది. ఓ భారీ పాము ఉన్నట్లు తెలిపారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లాను. చెట్టు కింద ప్రాంతాన్ని తవ్వగా సుమారు 25 నుంచి 30 వరకు ఉన్న నాగుపాము పిల్లల గుంపు ఒకటి కనిపించింది. వాటన్నింటినీ రక్షించి సమీపంలోని అడవిలోకి వదిలిశామం’’ అని తెలిపాడు. తల్లి పాము అప్పటికే వెళ్లిపోయిందని.. ఈ పిల్లలు అప్పుడే గుడ్ల నుంచి బయటకు వచ్చాయని చెప్పాడు.
