రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో హిమాచల్ రైడ్: 6 రోజులు.. 730 కిలోమీటర్లు..సౌత్ ఇండియన్ జర్నలిస్టుల సాహసయాత్ర

రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో హిమాచల్ రైడ్: 6 రోజులు.. 730 కిలోమీటర్లు..సౌత్ ఇండియన్ జర్నలిస్టుల  సాహసయాత్ర

బైక్ రైడింగ్ అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించడం మాత్రమే కాదు.. కొత్త ప్రాంతాలు, అక్కడి సంస్కృతి, ప్రజల జీవనశైలి, సంప్రదాయాలను దగ్గరగా తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం. సరిగ్గా అలాంటి అనుభూతినే అందించేందుకు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ‘ది గ్రేట్ ఇండియన్ క్రాస్ రోడ్స్–నార్త్ ఎడిషన్’. ఇందులో భాగంగా దక్షిణాదికి చెందిన 16 మంది జర్నలిస్టులు హిమాచల్ ప్రదేశ్‌లో ఆరు రోజుల పాటు  సుమారు 730 కిలోమీటర్ల సుదీర్ఘ సాహసయాత్ర చేపట్టారు.

హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాలకు చెందిన జర్నలిస్టులు.. చండీగఢ్, మషోబ్రా, కులు, మండి ప్రాంతాల మీదుగా సాగిపోయారు. ఈ యాత్రలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన సరికొత్త హిమాలయన్ 450, గెరిల్లా 450, క్లాసిక్ 350, హంటర్ 350, స్క్రామ్ 440, గోవన్ క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లను రైడర్స్ నడిపారు. వీరిలో చాలా మందికి హిమాలయాల్లో తొలిసారిగా లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ చేసిన సరికొత్త అనుభవం దక్కింది.

కేవలం రైడింగ్ మాత్రమే కాదు.. యాత్రలో భాగంగా జర్నలిస్టులు హిమాలయన్ హబ్‌ను సందర్శించారు. అక్కడ ఐషర్ గ్రూప్ ఫౌండేషన్ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ, మహిళల ఉపాధి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం.. మహాసు గ్రామాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. హిమాచలి సంప్రదాయాలు, స్థానిక వంటకాలు, వారి సాంస్కృతిక కార్యక్రమాలను మనసారా ఆస్వాదించారు.

హిమాలయాల అద్భుత అందాలను ఆస్వాదిస్తూ సాగిన ఈ యాత్రలో ప్రకృతి, సంస్కృతి, సాహసం.. ఒకే వేదికపై ఆవిష్కృతమయ్యాయి. కొత్త ప్రాంతాలను అన్వేషించడం, స్థానిక ప్రజలతో అనుబంధం పెంచుకోవడం, వారి జీవనశైలిని అర్థం చేసుకోవడం కూడా మోటార్‌సైక్లింగ్‌లో ఒక భాగమేనని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటిచెప్పింది.