జ్యోతిష్యుడు రాధా పండిట్ ను OSDగా పెట్టుకున్న సీఎం విజయ్

జ్యోతిష్యుడు రాధా పండిట్ ను OSDగా పెట్టుకున్న సీఎం విజయ్

తమిళనాడు రాజకీయాల్లో చిత్ర విచిత్రాలకు తావులేదు అని మరోసారి నిరూపితం అయ్యింది. సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందర్నీ షాక్ కు గురి చేసింది. ప్రముఖ జ్యోతిష్యుడిగా.. ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందిన రాధా పండిట్ ను సీఎం ఆఫీసులో OSD.. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కింద నియమించారు. ఈ మేరకు జీవో రిలీజ్ చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తుంది ఆ జీవో.. 

ఇంతకీ ఎవరీ రాధా పండిట్? :

రాధా పండిట్. తమిళనాడులో జ్యోతిష్యుడుగా గుర్తింపు పొందారు. రాజకీయాలతో బాగా లింక్ అయ్యి ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఏ పార్టీ గెలుస్తుంది.. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు అనే విషయాలపై జ్యోతిష్యం చెబుతుంటారు. నటుడిగా విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి.. టీవీకే పార్టీ పేరు పెట్టినప్పటి నుంచి.. తమిళనాడు రాజకీయాలపై జ్యోతిష్యం చెబుతూ వస్తున్నారు. 

ఎన్నికల్లో విజయ్ విజయం సాధిస్తారని.. తమిళనాడుకు విజయ్ సీఎం అవుతారని ఏడాది కాలంగా చెబుతూ వస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతాయని.. విజయ్ రాకతో మొత్తం మారిపోతుందని చెబుతూ వస్తున్నారు. ఆయన చెప్పినట్లే అంతా జరిగింది. విజయ్ సీఎం అయ్యారు. 

ఆయన మరో విషయం కూడా చెప్పారు.. విజయ్ జాతకం సునామీ లాంటిదని.. అందర్నీ తుడిచిపెట్టేస్తుందని.. ఆయన జాతకంలో రాజయోగం ఉందని బల్లగుద్ది మరీ మరీ చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే జరిగిందని తమిళనాడు జనం నమ్ముతూ వస్తున్నారు.

ఎన్నికల్లో విజయ్ గెలిచిన తర్వాత.. రాధా పండిట్ విజయ్ ఇంటికి వచ్చారు. సుదీర్ఘంగా చర్చించారు. విజయ్ ప్రమాణ స్వీకారం రోజున ఆయన హాజరయ్యారు. విజయ్ తో వ్యక్తిగతంగా ఆయన మంచి పరిచయం ఉందని.. చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా జ్యోతిష్యుడు రాధా పండిట్ ఏకంగా సీఎం విజయ్ OSDగా నియామకం అవ్వటం చర్చనీయాంశం అయ్యింది.