తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ ప్రముఖుల రాకతో వేదిక కళకళలాడింది. అయితే ఈ రాత్రికి హైలైట్ మాత్రం 'మనీ బ్రీఫ్‌కేస్' ఆఫర్ , కంటెస్టెంట్ల ఎలిమినేషన్లే.
రవితేజ ఎంట్రీ.. సిల్వర్ బ్రీఫ్‌కేస్ డ్రామా
ఫినాలేలో భాగంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్ర బృందం నుంచి మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్‌లు విచ్చేసి సందడి చేశారు. నాగార్జున ఒక ప్రత్యేక బాధ్యతను రవితేజకు అప్పగించారు. ఒక సిల్వర్ బ్రీఫ్‌కేస్ ఇచ్చి, దానిలోని నగదును తీసుకుని హౌస్ నుంచి ఎవరైనా ఒకరు స్వచ్ఛందంగా తప్పుకునేలా ఒప్పించాలని సూచించారు.
టాప్-3లో ఉన్న కల్యాణ్ పడాల, తనూజ, డిమోన్ పవన్‌లతో రవితేజ బేరసారాలు మొదలుపెట్టారు. మొదట రూ. 5 లక్షలతో ప్రారంభమైన ఈ ఆఫర్, క్రమంగా రూ. 15 లక్షలకు చేరుకుంది. ఈ దశలో డిమోన్ పవన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. టైటిల్ గెలుస్తానో లేదో అన్న సందిగ్ధంలో పడకుండా, చేతికి అందుతున్న నగదును స్వీకరించడమే మేలని భావించి రూ. 15 లక్షలతో బయటకు రావడానికి అంగీకరించారు.
విజేతకు దక్కేది రూ. 35 లక్షలే..!
పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల షో విజేతకు అందే మొత్తం ప్రైజ్ మనీలో మార్పులు వచ్చాయి. అసలు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు కాగా, పవన్ రూ. 15 లక్షలు తీసుకున్నందున, మిగిలిన రూ. 35 లక్షలు మాత్రమే ఈ సీజన్ విజేతకు దక్కుతాయని నాగార్జున స్పష్టం చేశారు. అయితే, ఓటింగ్ పరంగా చూసినా పవన్ మూడో స్థానంలోనే ఉండటంతో, అతను సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సంజన, ఇమ్మాన్యుయేల్ భావోద్వేగ వీడ్కోలు
అంతకుముందు, టాప్-5 నుంచి మొదటగా సంజన గల్రానీ ఎలిమినేట్ అయ్యారు. సీనియర్ నటిగా యంగ్ కంటెస్టెంట్లతో పోటీపడి టాప్-5కి రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. "ఇప్పటివరకు ఒక్క మహిళా విజేత కూడా లేరు, ఆ లోటును తనూజ తీర్చాలి" అని ఆమె ఆకాంక్షించారు.
ఆ తర్వాత నాలుగో స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యారు. స్టేజ్ మీదకు వచ్చిన ఇమ్మాన్యుయేల్ తన తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. "మనిషిలా ఉంటే చాలని ఈ షో నాకు నేర్పింది. బయట ఉన్నప్పుడు నేను చాలా పొరపాట్లు చేసి ఉండవచ్చు, కానీ బిగ్‌బాస్ నన్ను మార్చింది" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
తారల సందడి
ఈ ఫినాలే వేడుకకు రవితేజ బృందంతో పాటు, ‘ఛాంపియన్’ చిత్ర బృందం రోషన్, అనస్వర రాజన్, శ్రీకాంత్, ‘అనగనగా ఒక రాజు’ హీరోహీరోయిన్లు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరిలు విచ్చేసి షోలో వినోదాన్ని రెట్టింపు చేశారు. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి తన కామెడీతో హౌస్ మేట్స్‌ను నవ్వించారు.
