ఫేస్ టూ ఫేస్ చర్చించుకుందాం రా: కేసీఆర్‎కు సీఎం రేవంత్ సవాల్

ఫేస్ టూ ఫేస్ చర్చించుకుందాం రా: కేసీఆర్‎కు సీఎం రేవంత్ సవాల్

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‎కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కృష్ణా, గోదావరి నది జలాలపై అసెంబ్లీ వేదికగా ఫేస్ టూ ఫేస్ చర్చించుకుందాం రావాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చిట్ చాట్‎లో సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2న అసెంబ్లీ సమావేశం పెడతాం.. ఒక రోజు కృష్ణా, మరో రోజు గోదావరి జలాలపై మాట్లాడుకుందాం.. నీళ్లు, నిజాల పేరుతో అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని.. ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రెండేళ్ల తర్వాత కలుగులో నుంచి కేసీఆర్‌ బయటకు వచ్చారు. ఓటమితో కేసీఆర్‎లో మార్పు వస్తుందని ఆశించా.. ప్రజలు కర్రకాల్చి వాత పెడుతున్నా ఆయనలో అహంకారం తగ్గట్లేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే నీటి వాటాలో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిందని.. కృష్ణా జలాల్లో ఏపీకి 64 శాతం, తెలంగాణకు 36 శాతం చాలని సంతకం పెట్టిన ద్రోహి కేసీఆర్‌ అని విమర్శించారు. 

నీటి వాటాలపై సంతకం చేసి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు కేసీఆర్ మరణ శాసనం రాశారని అన్నారు. కేసీఆర్ తప్పులను సరిదిద్దుకుంటూ కృష్ణా జలాల్లో 71శాతం వాటా కావాలని ఇప్పుడు మేం కొట్లాడుతున్నామని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని అన్నారు. నీటి వాటాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలకు రావాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత బయటకు రావడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై గతంతో పాటు భవిష్యత్ ప్రణళికపై చర్చలో కేసీఆర్ పాల్గొనాలని కోరారు.