ఎవరెన్ని కుట్రలు పన్నిన న్యాయ పోరాటంలో గెలిచినం: గ్రూప్–1 తీర్పుపై CM రేవంత్ రియాక్షన్

ఎవరెన్ని కుట్రలు పన్నిన న్యాయ పోరాటంలో గెలిచినం: గ్రూప్–1 తీర్పుపై CM రేవంత్ రియాక్షన్

హైదరాబాద్: గ్రూప్ -1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై సీఎం రేవంత్ స్పందించారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన న్యాయ పోరాటంలో గెలిచామని.. హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. 

‘‘గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా.. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించాం. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఎంపికైన 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు నా అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిస్తున్నాను” అని పేర్కొన్నారు. 

తెలంగాణ హైకోర్టు తీర్పుతో  గ్రూప్ 1 ఉద్యోగులకు ఊరట లభించింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రద్దు చేయాలని  గతంలో  సింగిల్ జడ్జి ఇచ్చిన  తీర్పును హైకోర్టు ఇవాళ(ఫిబ్రవరి 5) రద్దు చేయడంతో ఉద్యోగాలు పొందిన 562 గ్రూప్ 1 అభ్యర్థులకు లైన్ క్లియర్ అయింది.

అసలు కేసు ఏంటి.?

563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్ సీ 2024ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 జూన్ 9న ప్రిలిమ్స్, 21 నుంచి 27 వరు మెయిన్స్ పరీక్షలు జరిగాయి.  2025 మార్చి 30న ఫలితాలు వెల్లడించింది.  ఏప్రిల్ 16 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది.  గ్రూప్ 1పరీక్ష నిర్వహణ, మూల్యాంకణంలో అవకతవకలు జరిగాయిని.. తెలంగాణ హైకోర్టులో దాదాపు 20 పిటిషన్లు దాఖలు అయ్యాయి. 

2025 ఏప్రిల్ 17న పిటిషన్లను విచారించిన హైకోర్టు  గ్రూప్-1 నియామక ప్రక్రియను ఆపాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో విచారణ పూర్తి అయ్యే వరకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే.. అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరికేషన్ మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది.  గ్రూప్ 1 కు ఎంపికైన మొత్తం 562 మందికి 2025 సెప్టెంబర్ 27న  సీఎం రేవంత్ రెడ్డి  నియామక పత్రాలు అందించారు. 

దీంతో గ్రూప్ 1 నియామకాలపై డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై  పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడంపై స్టే ఇవ్వాలని కోరారు. 2025అక్టోబర్ 7న జస్టిస్ సూర్యకాంత్, జోయమాల్య బాగ్జిల ధర్మాసనం పిటిషన్‎ను విచారించింది. ఇరు వర్గాల వాదనల అనంతరం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు. 

ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లన్నీ 2025 అక్టోబర్ 15న హైకోర్టులో విచారణకు రానుండడంతో  జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించాలని సూచించింది. వీలైనంత త్వరగా పిటిషన్లు విచారించి ఆదేశాలివ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీం కోర్టు ముగించింది.

అనంతరం గ్రూప్ 1ను రద్దు చేయొద్దంటూ ఉద్యోగ నియామక పత్రాలు పొందిన కొందరు అభ్యర్థులు,టీజీపీఎస్ సీ, ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేశారు. 2025 అక్టోబర్ 15న ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు స్టే విధించింది. తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉండాలని స్పష్టం చేస్తూ తుది తీర్పును 2026 ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.  

2026 ఫిబ్రవరి 5న (ఇవాళ) తుది తీర్పును వెల్లడించిన హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ సక్రమంగా జరిగాయని.. అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని తెలిపింది. దీంతో ఉద్యోగులకు ఊరట లభించింది.