తెలంగాణపై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాకే అడుగు పెట్టాలి : పవన్ కల్యాణ్ కు పీసీసీ చీఫ్ అల్టిమేటం

తెలంగాణపై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాకే అడుగు పెట్టాలి : పవన్ కల్యాణ్ కు  పీసీసీ చీఫ్ అల్టిమేటం

జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాకే ఇక్కడ అడుగు పెట్టాలని అల్టిమేటం జారీ చేశారు.  సినీ నటుడిగా పవన్ కళ్యాణ్, చిరంజీవిలకు  తాను అభిమానినే అని అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను  తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.  పవన్ కాళ్లపై మోకరిల్లాల్సిన దుస్థితి బీజేపీకి వచ్చిందన్నారు.   తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షునికే  దిక్కు దివానా లేదు...  ఇక తెలంగాణ వ్యతిరేకి అయిన పవన్ చెబితే తెలంగాణలో ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్  ఫిబ్రవరి 7, 8న తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ,జనసేన అభ్యర్థుల విజయం కోసం త్వరలో రూట్ మ్యాప్ ఖరారు కానుందని జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.  

బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్

ఓటు బ్యాంకు లేక బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్  చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వాఖ్యలకు  మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్  ఇచ్చారు. 12 ఏళ్లుగా రాష్ట్రానికి ఇక్కడి ఎంపీలు చేసింది ఏంటని.. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీకి ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు  నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని విమర్శించారు.  ఎన్నికలు రాగనే కులం పేరిట, మతం పేరిట చిచ్చుపెట్టి బీజేపీ  విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు.  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లు  గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు మహేశ్ కుమార్ గౌడ్.