ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో ఘనంగా నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు రోజా. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోందని.. కార్యకర్తలు ఎవరూ బయపడొద్దని, రాబోయే రోజుల్లో అన్నిటికీ సమాధానం చెబుదామని భరోసా ఇచ్చారు రోజా.
హైదరాబాద్ లోని కేపీహెచ్బీ కాలనిలో ఉన్న రమ్య గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రోజా స్థానిక నేతలతో కలిసి కేక్ కట్ చేసి వైఎస్ జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా సహా అతిధులుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, కారుమూరు వెంకట్ రెడ్డి, మాజీ MLC సతీష్ రెడ్డి, MLC శివరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 215 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు నిర్వాహకులు.రక్తదానం చేసిన దాతలకు హెల్మెట్ ఇచ్చారు నిర్వాహకులు . దాదాపు 8 వేల మందికి పైగా జగన్ అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా KPHB పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
