అయతుల్లా ఖమేనీ మృతిపై కేరళ సీఎం సానుభూతి

అయతుల్లా ఖమేనీ మృతిపై కేరళ సీఎం సానుభూతి

తిరువనంతపురం: అయతుల్లా ఖమేనీ మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్ సానుభూతి వ్యక్తం చేశారు. అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఇరాన్లో అమెరికా సృష్టించిన విధ్వంసం చూసి మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయని కేరళ సీఎం చెప్పుకొచ్చారు. అమెరికా సామ్రాజ్యవాద ధోరణి ఇజ్రాయెల్ లాంటి దేశాలకు ఊతమిస్తుందని చెప్పారు. అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని అన్ని దేశాలు ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కేరళ సీఎం విజయన్ పిలుపునిచ్చారు.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మృతిపై భారత్లోనూ చాలా ప్రాంతాల్లో ముస్లిం సంఘాలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్, హైదరాబాద్, బెంగళూరులో కూడా ఖమేని మృతిపై నిరసనలు వ్యక్తం చేశారు. కశ్మీర్లో పరిస్థితులు అదుపు తప్పడంతో విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంపై హైదరాబాద్ పాత బస్తీలో ఆందోళనలు చెలరేగాయి. షియా ముస్లిం సమాజానికి చెందిన పలు సంఘాలు ఈ ఘటనను ఖండిస్తూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. దారుల్‌షిఫా, పురానీ హవేలీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమికూడి ఖమేనీ చిత్రాలతో నిరసన వ్యక్తం చేశారు. కొందరు అమెరికా మరియు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలను శాంతియుతంగా నిర్వహించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అదనపు బలగాలను మోహరించి సున్నిత ప్రాంతాల్లో పహారా కట్టించారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఖమేనీ మరణంపై దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని మతపరమైన సంస్థలు సంతాప సభలు నిర్వహించగా, మరికొన్ని సంఘాలు అంతర్జాతీయ దర్యాప్తు కోరుతున్నాయి.