సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని.. మొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆ పార్టీకి అలవాటేనని అన్నారు బీఆర్ నాయుడు. ఆదివారం ( మార్చి 1 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ నాయుడు. కల్తీ నెయ్యి కేసులో ఉచ్చు బిగుస్తున్న క్రమంలో తనపై దుష్ప్రచారం ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
ఏకసభ్య కమిటీ రేపు తిరుమలకు రానున్న క్రమంలో ముందస్తుగానే తనపై దాడులు మొదలుపెట్టారని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడమే తమ లక్ష్యమని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే తాను స్పందిస్తున్నానని అన్నారు. పట్టువస్త్రాల సమర్పణకు భార్యతో రాలేదని ప్రశ్నించినందుకే తనపై దుష్ప్రచారానికి ఒడిగట్టారని అన్నారు. పరకామణి కేసు, కల్తీ నెయ్యి కేసుల్లో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారని అన్నారు బీఆర్ నాయుడు.
తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, రాజీనామా చేయమని ఒత్తిడి తేవడానికి భూమనకు ఎలాంటి హక్కు లేదని అన్నారు. భూమన కమిషన్ల పేరుతో దేవుడి సొమ్మును దోచేశారని ఆరోపించారు. నకిలీ, మార్ఫింగ్ వీడియోల ద్వారా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని.. దీనిపై లీగల్‌గా పోరాడతానని స్పష్టం చేశారు బీఆర్ నాయుడు.
తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవినీతి వ్యతిరేకంగా పోరాడుతున్నానని... వైఎస్ జగన్, వైఎస్ భారతిలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు చేసినందుకే తనపై వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు బీఆర్ నాయుడు.దేవుడి సేవ కోసం వచ్చానని, హిందూ మతానికి, టిటిడి వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ఎప్పుడూ ప్రవర్తించనని స్పష్టం చేశారు.తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని, భక్తులు, ప్రజలు నిజం గ్రహిస్తారని అన్నారు బీఆర్ నాయుడు.
