టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది. తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ, ఫార్ట్స్ న్యూస్ ఏజెన్సీ వంటి ప్రధాన ఇరానియన్ వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేశాయి. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలిపాయి. ఖమేనీ కూతురు, అల్లుడు, కోడలు, మనుమడు చనిపోయినట్లు పేర్కొంది. సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా శనివారం (ఫిబ్రవరి 28) ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి.
ఖమేనీ నివాసమే లక్ష్యంగా మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి. దాదాపు 30 బాంబులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ అటాక్స్‌లో ఖమేనీ నివాసం తునాతునకలైంది. ఈ క్రమంలో ఖమేనీ సేఫ్ గా ఉన్నారని.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందే ఆయనను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది.
కానీ ఆదివారం (మార్చి 1) తెల్లవారుజూమున ఖమేనీ మరణంపై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో ఖమేనీ మరణించినట్లు ప్రకటించాడు. ‘‘చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు. మా ఇంటెలిజెన్స్, అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలను అతడు తప్పించుకోలేకపోయాడు.
ఈ చావుతో ఇరాన్, అమెరికా, బాధిత దేశాలకు న్యాయం జరిగింది. ఖమేనీతో పాటు ఇతర ఇరాన్ అగ్ర నాయకులు కూడా హతమయ్యారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ మరణించినట్లు ధృవీకరించింది. ఈ ప్రకటనల తర్వాత ఇరాన్ మీడియా అధికారికంగా ఖమేనీ మరణ వార్తను ధృవీకరించింది.
