- తాజా బదిలీలపై సీఎస్‌కు ఐఏఎస్‌ల మొర
- పలువురు మంత్రుల నుంచీ అభ్యంతరాలు
- అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండే పోస్టింగుల పైనే మక్కువ
- అధికారుల సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోకపోవడం మరో సమస్య
- అధికార, రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల తాజా ట్రాన్స్ఫర్ల వ్యవహారం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బదిలీల్లో భాగంగా కేటాయించిన పోస్టింగులపై పెదవివిరుస్తున్న పలువురు ఐఏఎస్‌లు తమను కీలక విభాగాలకు మార్చాలంటూ సీఎస్‌కు మొరపెట్టుకుంటున్న తీరు హాట్‌టాపిక్‌గా మారింది.
ఐఏఎస్ లు అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండే పోస్టింగుల పై మక్కువ చూపుతుండగా, కొందరు మంత్రులు సైతం తమకు కావాల్సిన వారి కోసం పట్టుబడ్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. అధికారుల సామర్థ్యాలు, వారు ఎక్కడ మెరుగ్గా పనిచేయగలరనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బదిలీలు చేస్తుండడం కూడా మరో కారణంగా చెప్తున్నారు.
గతంలో ఒక్కసారి పోస్టింగ్ ఇస్తే రెండు, మూడేళ్ల దాకా వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండేది కాదని, కానీ ప్రస్తుతం ఐఏఎస్ ట్రాన్స్ఫర్ల వ్యవహారం గందరగోళంగా మారుతోందని సెక్రటేరియెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండస్ట్రీస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్ స్థానంలో ఎన్.శ్రీధర్‌ను నియమించిన కొద్ది గంటల్లోనే ఆ శాఖను సీఎస్ రామకృష్ణారావుకు అప్పగించడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా కలెక్టర్‌గా పనిచేసి దేవాదాయ శాఖకు బదిలీ అయిన ఓ ఐఏఎస్ అధికారి తన తాజా పదవి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. తనకు ఏదైనా పెద్ద శాఖ ఇవ్వాలని లేదంటే వేరే జిల్లాకైనా కలెక్టర్ గా పంపాలని సీఎస్‌కు విన్నవించుకున్నట్లు సమాచారం. గతంలో కలెక్టర్ గా బదిలీ అయిన వెంటనే మళ్లీ అదే జిల్లాకు వెళ్లిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి కూడా ఇప్పుడు తనకు లేబర్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కమిషనర్ పోస్టు ఇవ్వడం పట్ల పెదవి విరుస్తున్నట్లు తెలిసింది.
అలాగే టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నియామక వ్యవహారంలో సంబంధిత శాఖ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. టీజీఎంఎస్ఐడీ ఎండీగా ఉన్న మరో అధికారిని ప్రభుత్వం నారాయణపేట అదనపు కలెక్టర్ గా బదిలీ చేయడం పైనా తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఆయన ఒక పోలీసు ఉన్నతాధికారికి బంధువు కావడంతో ఆ పలుకుబడితో తనకు వేరే పోస్టింగ్ కావాలని పైరవీలు చేయిస్తున్నట్లు తెలుస్తున్నది. ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా ఉన్న మరో ఐఏఎస్ అధికారి సైతం తనకు మరింత ప్రాధాన్యత ఉన్న పోస్టింగ్ ఇవ్వాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. జోనల్ కమిషనర్ గా పోస్టింగ్ వచ్చిన ఒక యువ ఐఏఎస్ అధికారి తనకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఉందని సీఎస్ కు మొరపెట్టుకున్నారు. తనను ఏదైనా ఐటీడీఏకు పంపాలని లేదా ఏదైనా జిల్లాకు కలెక్టర్ గానైనా వేయాలని ఆయన కోరుతున్నారు.
ప్రజావాణి నోడల్ ఆఫీసర్, సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా ఒకే అధికారికి ఎక్కువ పోస్టులు అప్పగించడం పైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాను ప్రజావాణి బాధ్యతలు కొనసాగిస్తానని, పంచాయతీరాజ్ కు బదులు వేరే శాఖ ఇవ్వాలని ఆ అధికారి నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
పరిపాలనా యంత్రాంగంలో ఏ బాధ్యత అప్పగించినా తమదైన ముద్రవేస్తూ ప్రజలకు సేవ చేయాల్సిన ఐఏఎస్‌లు పలుకుబడిగల శాఖల కోసం పట్టుబడ్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ సస్పెన్షన్
సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అత్యున్నత స్థాయి అఖిల భారత సర్వీసు అధికారిపై తీసుకున్న మొట్టమొదటి కఠిన చర్య ఇదే కావడం గమనార్హం.
ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అరవింద్ కుమా ర్‌పై ప్రాసిక్యూషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి లాంఛనంగా అనుమతి (గ్రీన్ సిగ్నల్) రావడంతోనే రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసు కుంది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణమే అమ ల్లోకి వస్తాయని, తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఆయనను విధుల నుంచి పక్కన పెడుతు న్నట్లు సాధారణ పరిపాలనా శాఖ ప్రకటించిం ది. నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని ఏసీబీ పేర్కొన్నది.
ఇదిలా ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లో అరవింద్ కుమార్ రిటైర్మెంట్ ఉన్నది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన అరవింద్ కుమార్ గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. ఎలాంటి పాలనాపరమైన, ఆర్థికపరమైన అనుమతులు తీసుకోకుండానే ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకు విదేశీ మారకద్రవ్య రూపంలో నిధులు చెల్లించడం తీవ్ర దుమారం రేపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించడంతో డొంక కదిలింది. ఏసీబీ సమర్పించిన ప్రాథమిక ఆధారాలతో పాటు విచారణలో వెల్లడైన కీలక డాక్యుమెంట్ల ఆధారంగా ప్రాసిక్యూషన్ అనుమతి కోసం రాష్ట్ర సర్కారు డీఓపీటీకి లేఖ రాసింది. కేంద్రం నుంచి ఆమోదముద్ర పడిన వెంటనే సస్పెండ్ చేసింది.
