నువ్వు నా కాలి బూటుతో సమానం: పాక్ పేసర్ ఓవరాక్షన్‎కు వైభవ్ దిమ్మతిరిగే రిప్లై

నువ్వు నా కాలి బూటుతో సమానం: పాక్ పేసర్ ఓవరాక్షన్‎కు వైభవ్ దిమ్మతిరిగే రిప్లై

న్యూఢిల్లీ: భారత్‎తో జరిగిన అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్ ప్లేయర్లు ఓవరాక్షన్ చేశారు. మరీ ముఖ్యంగా ఇండియా ఇన్సింగ్స్ సమయంలో పాక్ పేసర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. వికెట్ పడగానే హద్దులు మీరి సెలబ్రేషన్స్ చేస్తూ ఇండియా ప్లేయర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భారత యంగ్ సంచలనం వైభవ్ సూర్య వంశీని ఔట్ చేసిన అలీ రజా ఓవరాక్షన్ చేశాడు. వైభవ్ క్యాచ్ ఔట్ కాగానే రజా అతడి వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ ఏదో అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్ అదే రీతిలో బదులిచ్చాడు. నువ్వు నా కాలి బూటుతో సమానం అన్నట్లుగా అలీ రజాకు షూ చూపించాడు వైభవ్. 

వైభవ్ కంటే ముందు టీమిండియా కెప్టెన్ అయూష్ మాత్రేను కూడా అలీ రజా రెచ్చగొట్టాడు. మాత్రేను ఔట్ చేసిన తర్వాత ఏదో అసభ్య పదజాలంతో దూషించాడు. వెంటనే చిర్రెత్తుకొచ్చిన అయూష్ మాత్రే ఏమన్నావురా అంటూ అతడి వైపు దూసుకెళ్లాడు. ఈ ఘటనలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఇది చూసిన ఇండియన్స్ శభాష్ వైభవ్, మాత్రే.. పాక్ కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అండర్-19 ఆసియా కప్ విజేతగా పాకిస్థాన్ నిలిచింది. టోర్నీ ఆసాంతం జైత్రయాత్ర సాగించిన భారత్ కీలకమైన చివరి పోరులో చేతులేత్తేసింది. దీంతో ఆదివారం (డిసెంబర్ 21) దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో ఇండియాపై గెలుపొందింది. 

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ బ్యాటర్ సమీర్ మిన్హాస్ (172) సెంచరీతో చెలరేగగా.. అహ్మద్ ఉస్సేన్ (57) హాఫ్ సెంచరీతో రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. 

అనంతరం 348 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 26.2 ఓవర్లలో156 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత యువ కెరటాలు వైభవ్ సూర్యవంశీ (22), అభిజ్ఞాన్ కుండు (13, కెప్టెన్ ఆయూష్ మాత్రే (2) సహా అందరూ విఫలం కావడంతో టీమిండియా కుర్రాళ్లకు ఓటమి తప్పలేదు. 

పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లుతో ఇండియా పతనాన్ని శాసించగా.. మహ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్, హుజైఫా అహ్సాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో టోర్నీ మొత్తం విజయాలతో దూసుకెళ్లిన ఇండియా కుర్రాళ్లు ఫైనల్ పోరులో ఓటమి పాలై నిరాశతో ఇంటి ముఖం పట్టారు.