న్యాయం కోసం అండర్ వరల్డ్ డాన్ కూతురి పోరాటం: ప్రధాని మోదీ, అమిత్ షాలకు విజ్ఞప్తి...

న్యాయం కోసం అండర్ వరల్డ్ డాన్ కూతురి పోరాటం: ప్రధాని మోదీ, అమిత్ షాలకు విజ్ఞప్తి...

ముంబై అండర్ వరల్డ్ మాజీ డాన్ హాజీ మస్తాన్ కూతురిగా చెప్పుకుంటున్న హసీన్ మస్తాన్ మీర్జా తనపై జరిగిన ఘోరాల గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.  తన తండ్రి చనిపోయిన తర్వాత సొంత కుటుంబమే కష్టాల్లోకి నెట్టారని, తనకు న్యాయం చేయాలని హసీన్ మస్తాన్ మీర్జా కోరింది. 

 1994లో తన తండ్రి చనిపోయినప్పుడు తాను చాలా చిన్నపిల్లనని, ఆ తర్వాత తన జీవితం ఆందోళనకరంగా మారిందని హసీన్ చెప్పింది. 1996లో తాను మైనర్‌గా ఉన్నప్పుడే, ఆస్తి కోసం తన మేనమామ కొడుకుతో బలవంతంగా పెళ్లి చేశారని ఆరోపించింది.

పెళ్లి చేసుకున్న వ్యక్తి తనని చంపడానికి కూడా ప్రయత్నించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఆస్తిని కాజేయడానికి తన గుర్తింపును  దొంగిలించాడని, ఆ వ్యక్తికి అప్పటికే ఎనిమిది సార్లు పెళ్లయిందని చెప్పుకొచ్చింది. ఈ వేధింపులు తట్టుకోలేక మూడుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు తెలిపింది.

 సహాయం కోసం పోలీసుల దగ్గరకు వెళ్తే, తనను ఆదుకోకపోగా.. తన గతం గురించి, తండ్రి గురించి తప్పుడు ప్రశ్నలు అడిగేవారని ఆమె గుర్తుచేసుకుంది. న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నా ఫలితం లేదని వాపోయింది.

 హసీన్ మస్తాన్ మీర్జా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేసింది. ట్రిపుల్ తలాక్ లాంటి మంచి చట్టాలు తెచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ.... కానీ నాలాంటి బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆమె కోరింది. ఇది తన వ్యక్తిగత పోరాటమని, తన తండ్రి గతంతో దీనికి సంబంధం లేదని హసీన్ స్పష్టం చేసింది.