- కొత్త రాజకీయ శక్తి నడి గడ్డకు నీళ్లు తీసుకొచ్చే వజ్రాయుధం
- రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జాగృతి పోటీ
- గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నడు నీయ్యత్ ఉంటే రాజీనామా చెయాలె
- అత్తా, అల్లుడు రాజకీయం నడ్వద్.. గద్వాలలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్/గద్వాల: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డను నిండా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో నడుస్తోంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నీతి నిజాయితీ ఉంటే ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఇక్కడ అత్తా లేదా అల్లుడే ఎమ్మెల్యేలుగా ఉంటున్నారని అన్నారు. తాము ఒక ఆయుధాన్ని నూరుతున్నామని, కొత్తగా వచ్చే రాజకీయ శక్తి నడిగడ్డకు వజ్రాయుధమైతుందని అన్నారు. ఇక్కడి నుంచే మార్పు మొదలైతదని అన్నారు. రంజిత్ ఎమ్మెల్యే కావడం పక్కా అన్నారు.
గద్వాలలో సోమవారం నిర్వహించిన రైతు దీక్షలో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులు బరిలో ఉంటారని, వారిని గెలిపించాలని కోరారు. 'ఎలక్షన్ అనంగానే అత్త, అల్లుడు వస్తరు.. మూటలు ముల్లెలు తీసుకొని దిగుతరు.. మీ నెత్తి కొట్టి సంపాదించనవే.. ఓటు మాత్రం జాగృతికి, రంజిత్ చెప్పిన మనుషులకు ఓటు వేయాలి' అని అన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాం
జాగృతి పార్టీ ఆవిర్భవించక ముందే నారాయణపేట జిల్లాలో సర్పంచ్ పదవిని గెలుచుకుందని కవిత చెప్పారు. వడ్డేపల్లి మున్సిపాలిటీనే కైవసం చేసుకుందని సంతోషం వ్యక్తం చేశారు. ' వాళ్లు మనతో ఉన్నారా లేదా..? అనేది లెక్క కాదు.. వడ్డేపల్లిలో జాగృతి జెండా ఎగురంగానే సీఎం పిలిచి వాళ్లకు కండువాలు కప్పిండు..' అంటే గెలిచింది మనమే అన్నారు.
గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచారని, నీయత్ ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈయన నెలనెలా చందాలు ఇస్తున్నానని చెబుతున్నారని, ఈయన ఎట్ల ఇస్తుండు.. వాళ్లు ఎట్ల తీసుకుంటారని ప్రశ్నించారు. కృష్ణ, తుంగభద్ర నీళ్లు మన చేలకు చేరాలనే ఆకాంక్షతోనే జాగృతి పోరాడుతుందని ఆమె తెలిపారు.
15 లక్షల మందికి రుణమాఫీ కాలే
రాష్ట్రంలో 15 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని కవిత అన్నారు. ఎవరైనా ఇద్దరు అన్నలకే భయపడతారని, ఒకటి అడవిలో ఉండే అన్నలకు... రెండోది రైతన్నలకు అని అన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్కే లేదన్నారు.
యూరియా కోసం యాప్లో బుక్ చేసుకోవాలని చెబుతున్నారని, రైతుల దగ్గర ఆ ఫోన్లు ఉండవని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వమే రైతులకు ఐఫోన్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎన్నికలకోసం ఇచ్చే గిఫ్ట్లా తయారైందని అన్నారు. ఎన్నికలప్పుడే సీఎంకు రైతులు గుర్తొస్తున్నారని అన్నారు.
