హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా మారట్లే.. ఇవి మూడే కారణాలు !

హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా మారట్లే.. ఇవి మూడే కారణాలు !
  • మద్యం మత్తు.. డ్రైవింగ్తో చిత్తు.. 
  • రాజధానిలో పెరుగుతున్న డ్రంకెన్​ డ్రైవ్ కేసులు
  • గత ఏడాది 53,243 కేసులు
  • ఈ ఆరు నెలల్లోనే దొరికింది 24,138 మంది 
  • 2025లో రెండోసారి పట్టుబడినోళ్లు 1,519
  • 2026 జూన్​ వరకు ఈ సంఖ్య 454

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య రోజూ పెరుగుతూనే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ పట్టుకుంటున్నా, అవగాహన కల్పిస్తున్నా తీరు మారడం లేదు. నగర పరిధిలో గత ఏడాది 53,243 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా,..ఈ ఏడాది జూన్ నాటికే 24,138 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2025లో 1,599 మంది రెండోసారి పట్టుబడగా, 2026 జూన్ నాటికే ఈ సంఖ్య 454కి చేరింది.

చట్టం అంటే భయం లేకపోవడం, మద్యం తాగినా పోలీసులకు దొరకను అనే ఓవర్ కాన్ఫిడెన్స్, మద్యం మైకంలో విచక్షణాజ్ఞానం కోల్పోవడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. మద్యం తాగినపుడు డ్రైవర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసుకోవడం లేదా క్యాబ్‌‌‌‌‌‌‌‌లు, పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవని, రూల్స్​బ్రేక్​చేస్తే జైలు శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

వేల మందికి జైలు శిక్షలు అయినా..
2025లో 2,472 మంది మందు తాగి వాహనం నడుపుతూ పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. ఇందులో ఒక రోజు శిక్ష పడిన వారు 346 మంది ఉండగా, 2 రోజులు జైలుకు వెళ్లిన వారు1,013 మంది, మూడు రోజులు 400 మంది , 4 రోజులు 285 మంది, 5 రోజులు 76 మంది , 6 రోజులు 242 మంది ,  వారం రోజులు 47 మంది , ఒకరికి 8  రోజులు, 10 రోజులు 40 మంది, 12 రోజులు 8 మంది, 15 రోజులు 3 మంది, 18 రోజులు ఒకరు, 20 రోజులు ఐదుగురు,  21 రోజుల జైలు శిక్ష అనుభవించిన వారు ఒక్కరు ఉన్నారు.  

2026లో..
2026 జూన్ నాటికి 679 మంది జైలు పాలు కాగా...ఒక రోజు శిక్ష పడినవారు 66 మంది, రెండు రోజులు 226 మంది, మూడు రోజులు 72 మంది, నాలుగు రోజులు 50 మంది, ఐదు రోజులు 191 మంది, ఆరు రోజులు ఆరుగురు, వారం రోజులు 15 మంది, 8 రోజులు ఒకరు, 9 రోజులు 20 మంది, 10 రోజులు 23 మంది, 15 రోజులు నలుగురు , 20 రోజులు ఇద్దరు, నెల రోజుల జైలు శిక్ష ఒకరికి, 35 రోజుల శిక్ష మరొకరికి పడింది.