హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని ఆ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ కల్వల్ శ్రీకాంత్, ఇతర నేతలతో పాటు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు చెందిన సుమారు రూ.20 వేల కోట్లు ఇప్పటికే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులుగా ఉన్నాయని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతి నెలా మరో రూ. 200 కోట్లు స్టాక్ మార్కెట్ పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఇప్పటికే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలోనూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
త్వరలోనే నిర్ణయం: ఎంపీ
సీపీఎస్‌ఈయూ వినతిపై వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనని, దీనిపై ఇప్పటికే ఏఐసీసీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
