- సదర్ మాట్, కడెం కాలువలకు నీటి విడుదల
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని సదర్ మాట్, కడెం కాలువల నీటి విడుదలపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయడం మానుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. ఖానాపూర్ మండలం మేడంపల్లి వద్ద గల సదర్మాట్ కాలువతోపాటు కడెం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో రైతులకు సాగు నీటి విడుదలలో కొంత జాప్యం జరిగిందన్నారు.
ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. కడెం ఎడమ కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. నీటి విడుదలపై విషయంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, రైతుల సం క్షేమం గురించి ఆ పార్టీలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి డి.దయానంద్, మండల, పట్టణ అధ్యక్షులు జంగిలి శంకర్, గొర్రె గంగాధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా సత్యం, ఆత్మ చైర్మన్ తోట సత్యం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
