సర్కార్ దవాఖానాల్లో ఇన్సులిన్ కొరత.. అల్లాడిపోతున్న షుగర్ పేషెంట్లు!

సర్కార్ దవాఖానాల్లో ఇన్సులిన్ కొరత.. అల్లాడిపోతున్న షుగర్ పేషెంట్లు!
  • జోగులాంబ గద్వాల జిల్లాలో 20,448 మంది షుగర్ పేషెంట్లు
  • జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు నెలలుగా నిలిచిన ‘ప్రిమిక్స్ ఇన్సులిన్ 
  • 30/70’ సరఫరా
  • గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చి సిబ్బందిని నిలదీస్తున్న రోగులు 

గద్వాల, వెలుగు :  జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురువతున్నాయి. గత మూడు నెలలుగా ప్రిమిక్స్ ఇన్సులిన్ 30/70 మందు అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఉచితంగా లభించే ఈ మందు ఆస్పత్రిలో దొరక్కపోవడం, బయట కొనుగోలు చేయలేక పేషెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఇండెంట్ పెట్టినా సరఫరా కాకపోవడంతో రోగులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.

జిల్లాలో 20,448 మంది షుగర్ పేషెంట్లు.. 

జిల్లాలో మొత్తం 20,448 మంది షుగర్ పేషెంట్లు ఉండగా, వారిలో సుమారు 8 వేల మంది ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఈ ఇన్సులిన్ పొందుతున్నారు. మందు నిలిచిపోవడంతో వడ్డేపల్లి, రాజోలి తదితర మండలాల్లోని ఆస్పత్రుల వద్ద రోగులు గొడవకు దిగిన సందర్భాలున్నాయి. నిత్యం అవసరమయ్యే మందు ఒక్క రోజు వాడకపోయినా ఇబ్బందులు వస్తాయని, ప్రత్యామ్నాయ మందులు కూడా సూచించకపోవడంపై పేషెంట్లు మండిపడుతున్నారు. కేంద్ర డ్రగ్ స్టోర్ అధికారులు గత నెలలో రెండుసార్లు, ఈ నెలలో ఒకసారి ఇండెంట్ పెట్టినప్పటికీ పైనుంచి సరఫరా రావడం లేదని చెప్తున్నారు. 
సరిపోను ఫార్మసిస్టులు లేక.. 

ఇన్సులిన్ కొరతతో పాటు ఆస్పత్రుల్లో ఫార్మసిస్టుల కొరత తీవ్ర సమస్యగా మారింది. జిల్లాలోని 10 పీహెచ్‌‌‌‌సీల్లో పదిమంది ఫార్మసిస్టులు ఉండాలి, కానీ,  ఐదుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. సగం ఆస్పత్రుల్లో ఫార్మసిస్టులు లేకపోవడంతో ఏఎన్ఎంలు, నర్సులే మందులు పంపిణీ చేస్తున్నారు.  

మందుల కొరతను అంచనా వేసి ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టాల్సిన ఫార్మసిస్టుల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికైనా ఇన్సులిన్ వెంటనే సరఫరా చేయాలని, ఖాళీగా ఉన్న ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేయాలని పేషెంట్లు కోరుతున్నారు.

నెల నుంచి తిరుగుతున్నా మందు లేదు.. 

నేను కొంతకాలంగా ఇన్సులిన్ వాడుతున్నాను. నెల రోజుల నుంచి ధరూర్ హాస్పిటల్ కి తిరుగుతున్నా ఇన్సులిన్ మందు లేదని చెబుతున్నారు. ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పడం లేదు. మందు లేక మస్తు ఇబ్బందులు పడుతున్నా.. 
-బోయ పెంటన్న, షుగర్ పేషంట్, ధరూర్.

మెడిసిన్ అందుబాటులో ఉండేలా చూస్తాం

షుగర్ పేషెంట్లకు ఇన్సులిన్ మెడిసిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ పొరపాటు జరిగిందో క్రాస్ చెక్  చేస్తాం. పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
-సంధ్యా కిరణ్మయి డీఎంహెచ్ ఓ, గద్వాల.