- రోజుకు 20 నుంచి 25 లీటర్ల నీళ్లు తాగుతది
- మనిషి కంటే 6 రెట్లు పవర్ ఫుల్ విజన్
- 3 కిలోమీటర్ల వరకు వినిపించే గాండ్రింపు
- రోజుకు 15 నుంచి 25 కిలోమీటర్ల ప్రయాణం
- పుట్టుక నుంచి చావు దాకా.. డిఫరెంట్ గా పులి లైఫ్ స్టైల్
హైదరాబాద్, వెలుగు: పెద్దపులి.. ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన వేటగాడు. దాని నడకలో ఠీవీ, వేటలో చాకచక్యం అద్భుతం. ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయితే ఎంతటి జంతువునైనా ఖతం చేస్తుంది. ఒక్కో గెంతులో పదహారు అడుగులు.. వందల కిలోల బరువు.. మెరుపు వేగంతో దాడి.. వెరసి పులి అంటేనే అడవికి రాజు.. వేటలో రారాజు. అయితే, పుట్టుకతోనే పులి వేటగాడు కాదు. కళ్లు కూడా తెరవని స్థితి నుంచి అడవిని శాసించే స్థాయికి ఎదిగే క్రమం ఆసక్తికరం. పులి జీవన విధానంపై ‘వెలుగు’ ప్రత్యేక కథనం.
అమ్మగా ప్రేమకు దాసోహం..
క్రూర మృగమైనా సరే అమ్మప్రేమకు దాసోహమే. ఒక ఆడపులి గర్భధారణ కాలం సుమారు 93 నుంచి 112 రోజులు. డెలివరీ టైమ్ రాగానే.. మగ పులికి, ఇతర జంతువులకు దూరంగా దట్టమైన పొదలు లేదా గుహల్లోకి వెళ్లిపోతుంది. ఒకసారికి 2 నుంచి 4 పిల్లలకు జన్మనిస్తుంది. అయితే, అన్ని పిల్లలు బతకడం కష్టం. పుట్టినప్పుడు ముద్దలా ఉండే పులి.. పెరిగితే వందల కిలోల బరువుతో అడవిని గడగడలాడిస్తుంది.
పుట్టినప్పుడు వీటి బరువు కేవలం 750 గ్రాముల నుంచి1.5 కిలోలు మాత్రమే ఉంటుంది. పుట్టినప్పుడు పులి పిల్లలు కళ్లు కూడా తెరవలేవు. చాలా బలహీనంగా ఉంటాయి. సుమారు 6 నుంచి14 రోజుల తర్వాతే లోకాన్ని చూస్తాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లి పులి వాటిని కంటికి రెప్పలా కాపాడుతుంది. మగ పులులు పిల్లలను చంపే ప్రమాదం ఉండటంతో నిత్యం నివాసాలను మారుస్తూ పిల్లలను మెడ పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది.
పులి చారలూ వేటికవే ప్రత్యేకం
పులి చర్మం సామాన్యమైనది కాదు. ఇది శత్రువుల నుంచి కాపాడుకునే కవచం. దీని చర్మం మందం సుమారు 2 నుంచి 3 మిల్లీమీటర్లు. మనుషుల చర్మం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. దట్టమైన బొచ్చు ఎండ, వాన, చలి నుంచే కాకుండా చిన్న చిన్న దెబ్బల నుంచి రక్షిస్తుంది. వేటలో ఉన్నప్పుడు వేరే జంతువు దీని చర్మాన్ని పట్టుకున్నా.. తన బాడీని లోపల వైపు తిప్పి తిరిగి శత్రువుపై దాడి చేయగలదు.
రాత్రి పూట మనుషుల కంటే పులి 6 రెట్లు స్పష్టంగా చూస్తుంది. అందుకే రాత్రి వేటలో పులిని మించిన జంతవు మరోటి ఉండదని వైల్డ్‌లైఫ్ నిపుణులు చెప్తారు. మనిషి వేలి ముద్రలు ఎలాగైతే ఒకదానితో ఒకటి సరిపోలవో.. పులి చర్మంపై ఉండే చారల్లో కూడా ఒక పులికి మరో పులికి స్పష్టమైన తేడా ఉంటుంది.
ఆరు నెలల తర్వాత వేటలో ట్రైనింగ్
పులికి పుట్టుకతో వేట రాదు. తల్లి దగ్గర నేర్చుకోవాల్సిందే. ఫస్ట్ 6 నెలలు పిల్లలు పూర్తిగా తల్లిపాల మీదే ఆధారపడతాయి. 6 నెలల తర్వాత పిల్లలను తల్లి వేటకు తీసుకెళ్తుంది. ఆకులు కదలకుండా నడవడం.. గాలి శబ్దాన్ని బట్టి జంతువును పసిగట్టడం తల్లిని చూసి నేర్చుకుంటాయి. పిల్లలకు10 నెలల వయసు వచ్చాక తల్లి పులి గాయపడిన జంతువును చంపకుండా పిల్లల ముందు వదిలేస్తుంది. దాన్ని ఎలా చంపాలో పులి పిల్లలే ట్రై చేసి నేర్చుకోవాలి. 2 ఏళ్లు వచ్చేసరికి వేటలో నైపుణ్యం సాధిస్తాయి.
గంటకు 65 కిలోమీటర్ల వేగం
పులి ఒక్క లంకె వేస్తే 16 అడుగుల ఎత్తు ఎగురుతుంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. పూర్తిగా ఎదిగిన మగ పులి సుమారు 200 నుంచి 300 కిలోల బరువు ఉంటుంది. ఆడపులి మాత్రం మగదానితో పోలిస్తే కాస్త తక్కువగా100 నుంచి 170 కిలోల వరకు ఉంటుంది. అడవిలో పులి ఆయుర్దాయం సాధారణంగా 10 నుంచి 15 ఏళ్లు ఉంటుంది. వేటలో గాయాలు, ఆహార కొరత, వృద్ధాప్యంతో తొందరగా చనిపోతాయి.
ముసలితనం వచ్చే సరికి లేదా చివరి దశలో పులికి వేటాడే శక్తి తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పటి బరువుతో పోలిస్తే సుమారు 30 నుంచి 40 శాతం బరువు తగ్గి చిక్కి మరణిస్తాయి. అయితే, జూ పార్కుల్లో మంచి ఫుడ్, మెడికల్ సపోర్ట్ ఉండటంతో పులి 20 ఏళ్ల వరకు బతికే చాన్స్ ఉంటుందని పేర్కొంటున్నారు.
గాండ్రిస్తే 3 కిలోమీటర్లు వినిపిస్తుంది..
ఒక పులి తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు 10 నుంచి 20 కిలోమీటర్లు నడుస్తుంది. ఆకలి ఉన్నప్పుడు.. జంతువు కోసం వేటాడే క్రమంలో ఒక్కోసారి 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. పులి వెనుక కాళ్లలో బలం ఎక్కువ. నిలువుగా సుమారు 5 మీటర్లు ఎత్తు ఎగురుతుంది. అడ్డంగా అయితే 10 మీటర్ల (32 అడుగులు) దూరం గెంతుతుంది. పులి గాండ్రిస్తే సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇది తన సామ్రాజ్యాన్ని ప్రకటించుకోవడానికి చేసే హెచ్చరిక అని ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
పులి తారసపడితే ఏం చేయాలి?
మనం అడవిలోకి వెళ్లినప్పుడు గానీ, ట్రెక్కింగ్ లేదా సఫారీలో అనుకోకుండా పులి ఎదురైతే ప్రాణాలు కాపాడుకోవడానికి అటవీశాఖ అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పులిని చూసి భయంతో పరుగెత్తడం అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు. ‘మనుషులు పరుగెత్తితే పులి తన ఆహారం అనుకుని వెంటాడి చంపేస్తుంది. దాని వేగాన్ని మనిషి ఎప్పటికీ అందుకోలేడు. పులి కళ్లలోకి నేరుగా చూడకూడదు. పులికి ఎప్పుడూ వీపు చూపించకూడదు. దాని వైపు చూస్తూనే.. నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి.
మీ దగ్గర ఉన్న షర్ట్ లేదా జాకెట్ విప్పి చేతులతో పైకి ఎత్తి పట్టుకుని దానికంటే పెద్ద ఆకారంలో ఉన్నట్లు భ్రమ కల్పించాలి. ధైర్యంగా అరవాలి. చిరుతపులిలా కాకపోయినా పులి కూడా చెట్లు ఎక్కుతుంది. కాబట్టి చెట్టు ఎక్కడం సరైన రక్షణ కాదు. ఒకవేళ మీతో పిల్లలు ఉంటే వారిని భుజాలపై ఎత్తుకోవాలి. పిల్లల ఎత్తు తక్కువగా ఉండటం, వారి కదలికలు పులిని ఆకర్షించే అవకాశం ఉంటుంది’ అని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.
వారానికి ఒక్కసారే వేట.. నీటిలో జల్సా
పులి ఆకలి చాలా డేంజర్. దీని దవడల్లో ఉండే 4 అంగుళాల కోర పళ్లు ఎంతటి గట్టి ఎముకనైనా కొరికేస్తాయి. పెద్ద పులి బాగా ఆకలితో ఉంటే.. ఒక్కసారి కూర్చుంటే సుమారు 18 నుంచి 25 కిలోలకుపైగా మాంసాన్ని తింటది. వారానికి ఒక్కసారే పెద్ద జంతువును తిన్న తర్వాత మళ్లీ వేటాడటానికి 5 నుంచి 7 రోజులు గ్యాప్ తీసుకుంటుంది. అయితే, 10 సార్లు వేట ప్రయత్నాలు చేస్తే పులికి వేట చిక్కే అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుందని ఓ సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు.
కానీ బాగా ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా జంతువు తారసపడితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదలదన్నారు. ఇక నీటిలో పులి అద్భుతంగా ఈత కొడతుంది. అంతేకాదు, నదిని దాటడానికి 6 నుంచి 20 కిలోమీటర్ల దూరమైనా ఈదుకుంటూ వెళ్తుంది. మాంసం తిన్న వెంటనే పులికి విపరీతమైన దాహం వేస్తుంది. తిన్న మాంసం అరగడానికి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే, వేట తర్వాత నీటి కొలను వైపు వెళ్తుంది. వాతావరణాన్ని బట్టి రోజుకు10 నుంచి 20 లీటర్ల నీటిని తాగుతుంది.
