ఫ్రాన్స్‌లోని సూపర్ మార్కెట్ రంగాన్ని హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఫ్రాన్స్ సూపర్ మార్కెట్లపై జరిగిన సైబర్ దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వందలాది ప్రముఖ సూపర్ మార్కెట్ అవుట్‌లెట్లలోని రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ను దుండగులు హ్యాక్ చేశారు. అర్ధరాత్రి సమయంలో రిమోట్ మోడ్లో వాటి టెంపరేచర్‌ను ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌కు పెంచేశారు.
ఈ అనూహ్య దాడి వల్ల స్టోర్లలో భద్రపరిచిన తాజా, శీతలీకృత ఆహార పదార్థాలు (Fresh & Frozen Food) పూర్తిగా పాడైపోవడమే కాకుండా, కొన్ని చోట్ల ఫ్రిజ్‌లు వేడెక్కి మంటలు కూడా రేగాయి. ఆదివారం రాత్రి మొదలైన ఈ సైబర్ దాడితో.. హ్యాకర్లు సూపర్ మార్కెట్ల కూలింగ్ సిస్టమ్స్‌ను నియంత్రించి, ఫోర్స్డ్ డీఫ్రాస్టింగ్ (Forced Defrosting) మోడ్‌ను ఆన్ చేశారు.
దీనివల్ల అర్ధరాత్రి దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర ఫ్రిజ్‌లు గంటల తరబడి పనిచేయడంతో లోపల ఉన్న ఆహార ఉత్పత్తులన్నీ నాశనమయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ రిటైల్ దిగ్గజం Intermarche కి చెందిన 150 నుంచి 200 స్టోర్లు, అలాగే Cooperative Uకి చెందిన దాదాపు 100 అవుట్‌లెట్లు ఈ దాడికి గురయ్యాయి. ఫ్రాన్స్ అతిపెద్ద సూపర్ మార్కెట్ నెట్‌వర్క్ E Leclercపై కూడా ఈ ప్రభావం పడినట్లు తెలిసింది.
►ALSO READ | 16 ఏళ్ల అమ్మాయిని రోబో లైంగికంగా వేధించటం ఏంటి సామీ..? జర్మనీలో సంచలనం
ఆహార పదార్థాలు పూర్తిగా పాడైపోవడంతో వాటిని చెత్తబుట్టలో వేయక తప్పడం లేదని, దీనివల్ల భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని కంపెనీలు లబోదిబోమన్నాయి. ఈ వినూత్న దాడిపై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కేసు నమోదు చేసి అధికారిక దర్యాప్తును ప్రారంభించింది. సూపర్ మార్కెట్లలో సంభవించిన అగ్నిప్రమాదాలకు, ఈ సైబర్ దాడికి ఉన్న లింక్‌ను పోలీసులు నిర్ధారించే పనిలో ఉన్నారు.
