తమిళనాడులో 70 లక్షల ఓట్లు ఔట్: అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఏదంటే..?

తమిళనాడులో 70 లక్షల ఓట్లు ఔట్: అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఏదంటే..?

చెన్నై: తమిళనాడులో భారత ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తిగా ముగిసింది. దీంతో తుది ఓటర్లను జాబితాను ఈసీ సోమవారం (ఫిబ్రవరి 23) ప్రకటించింది. సర్ ప్రక్రియ అనంతరం తమిళనాడులో మొత్తం ఓటర్లు 5.67 కోట్లు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ వెల్లడించారు. వీరిలో 2,77,38,925 మంది పురుషులు, 2,89,60,838 మంది మహిళలు, 7,617 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 74 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడ్డాయని చెప్పారు. సర్‎కు ముందు తమిళనాడులో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 5.67 కోట్లకు తగ్గింది. 

2025, నవంబర్ నుంచి తమిళనాడులో ఈసీ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నిర్వహించిన విషయం తెలిసిందే. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఓటర్ తుది జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్‎ను 2025, డిసెంబర్ 19న ఈసీ ప్రకటించింది. ఈసీ విడుదల చేసిన డ్రాఫ్ట్ డేటా ప్రకారం.. తమిళనాడులో మొత్తం ఓటర్ల సంఖ్య 5.43 కోట్లుగా ఉంది. అందులో 2 కోట్ల 66 లక్షల మంది పురుషులు, 2 కోట్ల 77 లక్షల మంది మహిళలు, 7 వేల 191 ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లుగా పేర్కొంది.

97 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఇందులో 26.94 లక్షల మంది మృతి చెందిన వారు కాగా, 66.44 లక్షల ఓటర్లు స్థలం మారినట్లు పేర్కొంది. మరో 3.39 లక్షల ఓటర్లు వివిధ ప్రాంతాల్లో నమోదైనట్లు తెలిపింది. అనంతరం 2025, డిసెంబర్ 19  నుంచి 2026, జనవరి 30 వరకు ఈసీ అభ్యంతరాలు స్వీకరించింది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత 27,53,796 మంది కొత్త ఓటర్లుగా తుది ఓటర్ల జాబితాలో చేర్చబడ్డారు. 

తుది ఓటర్ల జాబితా ప్రకారం.. అత్యధిక ఓటర్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం చెంగల్పేట జిల్లాలోని షోజింగనల్లూరు. ఇక్కడ 5,36,991 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో- 2,62,621 మంది పురుషులు మంది.. 2,74,254  మంది మహిళలు, 116 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. చెన్నై జిల్లాలోని హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్ప ఓటర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్లో కేవలం 1,16,896 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 58,221 మంది పురుషులు, 58,620 మంది మహిళలు, 55 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. కాగా, 2026 సమ్మర్ లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

సర్ తుది జాబితా ప్రకారం: మొత్తం ఓటర్ల సంఖ్య 5.67 కోట్లు

2.77 కోట్ల మంది పురుష ఓటర్లు
2.89 కోట్ల మంది మహిళా ఓటర్లు
7,617 మంది థర్డ్ జెండర్ ఓటర్లు