- విండోస్ మూసి లేకపోతే రాళ్లు తాకి చనిపోయేదాన్ని: మమత
బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కారుపై ఉత్తర 24 పరగణాల జిల్లా హలిశహర్‌లో రాళ్లు, చెప్పులు, వాటర్‌బాటిల్స్‌తో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తన పర్యటన గురించి ముందుగా చెప్పినప్పటికీ పోలీసులకు భద్రతా ఏర్పాట్లు చేయలేదని మమత ఆరోపించారు.
కోల్‌కతా: బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు.
ఉత్తర 24 పరగణాల జిల్లా హలిశహర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీస్ కస్టడీలో మృతి చెందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ హలిశహర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కొందరు ఆందోళనకారులు ఆమె కారును అడ్డుకునేందుకు యత్నించారు.
కారుపై మట్టి చల్లడంతో పాటు రాళ్లు విసిరారు. ఇటుకలు, చెప్పులు, వాటర్ బాటిళ్లు కూడా విసిరినట్లు తెలిసింది. ఆపై వెహికల్‌ను చుట్టుముట్టి చోర్ భగావో అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అతికష్టంమీద నిరసనకారులను వెనక్కి నెట్టడంతో ఆమె కారు అక్కడి నుంచి కదిలింది.
మునుపెన్నడూ ఇట్ల జరగలే..
అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ‘‘బయటి నుంచి వచ్చిన సంఘవిద్రోహులు పోలీసుల ఎదుటే నా కారుపై రాళ్లు, చెప్పులు, పెద్ద పెద్ద ఇటుకలు విసిరారు. కారు అద్దాలు మూసి లేకపోతే ఇటుకలు, రాళ్లు తగిలి నా తల పగిలిపోయేది. నేను చనిపోయి ఉండేదాన్ని. ఇలాంటి దాడిని ఇంతకుముందెన్నడూ ఎదుర్కోలేదు.
నేను వస్తున్నట్లు ముందుగానే పోలీసులకు చెప్పినప్పటికీ భద్రతా ఏర్పాట్లు చేయలేదు. మమ్మల్ని రక్షించేందుకు చర్యలు తీసుకోలేదు. బీజేపీకి మాత్రమే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు’’ అని ఆమె ఆరోపించారు. ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందని, పోలీసులు సంఘవిద్రోహులను కాపాడేందుకు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. టీఎంసీ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ కూడా పోలీసులు, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
ప్రజలే ఆమెను వ్యతిరేకిస్తున్నరు: బీజేపీ
మమతా బెనర్జీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే కాంచ్రపారాకు వెళ్లారని బీజేపీ ఆరోపించింది. ఆమె రాకను స్థానికులు వ్యతిరేకించారని పేర్కొంది. రాళ్ల దాడి ఘటనకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య స్పష్టం చేశారు.
పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడటాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని పేర్కొన్నారు. దాడి చేసినోళ్లపై చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల మమత, ఆమె కుటుంబ సభ్యుల పర్యటనల్లో నిరసనలు పెరుగుతున్నాయి.
జూన్‌లో కలకత్తా హైకోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలోనూ మమతకు వ్యతిరేకంగా ‘చోర్ చోర్’ నినాదాలు చేశారు. అదే నెలలో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సోనార్‌పూర్ పర్యటనలోనూ ఆయన కాన్వాయ్‌పై గుడ్లు విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి.
