- పోలీసుల దాడిపై సుప్రీం తీరు తమను బాధించిందని వెల్లడి
- కాన్వొకేషన్‌లో సీజేఐ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోబోమని స్పష్టం
హైదరాబాద్, వెలుగు: నల్సార్ యూనివర్సిటీలో 2026 కాన్వొకేషన్ చీఫ్ గెస్టు అంశంపై రచ్చ మొదలైంది. కాన్వొకేషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని విద్యార్థులు వర్సిటీ అధికారులను కోరారు.
ఆయన చేతుల మీదుగా డిగ్రీలు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెబుతూ వీసీ, రిజిస్ట్రార్‌కు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీజేఐ తీరు విద్యార్థులు, పౌర హక్కుల పట్ల ఉదాసీనంగా ఉందని వారు లేఖలో ఆరోపించారు. నల్సార్‌లో తాము నేర్చుకున్న రాజ్యాంగ విలువలు, న్యాయం, పౌర హక్కులకు సీజేఐ ఇటీవల వ్యవహరించిన తీరుకు పొంతన లేదని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు.
ఎంతో భావోద్వేగంతో కూడిన కాన్వొకేషన్ రోజున అలాంటి వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోవడం తమ మనసాక్షికి విరుద్ధమని విద్యార్థులు స్పష్టం చేశారు. స్టూడెంట్ల జీవితంలో కాన్వొకేషన్ ఎంతో కీలకమైన సందర్భమని.. అలాంటి సమయంలో నిరంకుశంగా వ్యవహరించిన వ్యక్తిని చీఫ్ గెస్టుగా ఆహ్వానించవద్దని వారు డిమాండ్ చేశారు.
నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందే..
నల్సార్ కాన్వొకేషన్ తేదీ ఇంకా ఖరారు కాలేదని.. ఇప్పటికైనా వర్సిటీ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందేనని విద్యార్థులు కోరారు. చీఫ్ గెస్టు ఎంపికలో పట్టాలు తీసుకోబోయే విద్యార్థుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం అయ్యే చాన్స్ ఉందని హెచ్చరించారు. ఇది ఒక్క బ్యాచ్‌కు సంబంధించిన సమస్య కాదని.. విద్యార్థులందరి ఉమ్మడి అభిప్రాయంగా చూడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను గత నెల 23న ‘కాన్వొకేషన్ 2026 బ్యాచ్’ పేరుతో రాశారు.
కారణం ఇదే..
జులై 20న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ విద్యార్థులు ‘చలో సంసద్’ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మహిళలు, పిల్లలపై కూడా కనికరం లేకుండా లాఠీచార్జీ చేశారు. సుమారు 170 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని, ఈ ఘటనపై అత్యవసర విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని బెంచ్ స్పందించిన తీరు విద్యార్థులను కలిచివేసింది.
వీడియోలు చూడటానికి సమయం లేదని, తమ సమయాన్ని వృథా చేయొద్దని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో నల్సార్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై విచారణకు అంగీకరించింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, కేవలం నిరసన చేస్తున్నారనే కారణంతో లాఠీచార్జీని సమర్థించలేమని కోర్టు
స్పష్టం చేసింది.
