- కర్నాటక బందీపూర్ నమూనాపై అటవీశాఖ అధ్యయనం
- రూపాయి పెట్టుబడి పెడితే రూ.716 వరకు ఆదాయం
- ఏడాదికి రూ.6,406 కోట్ల రాబడి
- ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్’తో కలిసి ఎకో-లాడ్జీలు, సఫారీలు
హైదరాబాద్, వెలుగు: అడవిని కాపాడుకోవడమే కాదు.. దాని ద్వారా కోట్లాది రూపాయల ఇన్ కమ్ ఆర్జించేలా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రణాళికలు రూపొందిస్తుంది. కర్నాటకలోని 'బందీపూర్ టైగర్ రిజర్వ్' మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లను టూరిస్ట్ ప్లేస్‌లుగా డెవలప్ చేసి ఆదాయ వనరులుగా మార్చడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పులుల సంరక్షణతోపాటు ఎకో-టూరిజం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడంతోపాటు ప్రభుత్వానికి కోట్లు సమకూర్చేలా ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.
ఈ మేరకు రీసెంట్‌గా ఫారెస్ట్ ఆఫీసర్లు బందీపూర్ మోడల్‌పై స్టడీ చేశారు. అక్కడ పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి ఏకంగా రూ.716 ఆదాయం వస్తున్నట్లు గుర్తించారు. బందీపూర్ అడవుల పర్యావరణ ఆస్తుల విలువ దాదాపు రూ.14,966 కోట్లుగా ఉన్నాయని, అక్కడ లభించే పర్యావరణ సేవల ద్వారా ఏటా రూ.6,406 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా వేశారు. ఇదే తరహా రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ రిజర్వ్‌లలోనూ ఆవిష్కరించవచ్చని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
అమ్రాబాద్, కవ్వాల్‌లలో ఏటా రూ.2.5 కోట్లకు పైగా రాబడి..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దాదాపు 2,611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, కవ్వాల్ 2,015 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. బందీపూర్, నాగర్‌హోళె, కన్హా, పెంచ్, రణథంబోర్, కార్బెట్ వంటి రిజర్వ్‌ల తరహాలో మన రాష్ట్రంలో ఇంకా పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయలేదు. సరైన సఫారీ సర్క్యూట్లు, ఎకో-లాడ్జీలు, శిక్షణ పొందిన గైడ్‌లు లేకపోవడం వల్ల ఇక్కడ టూరిస్టుల తాకిడి తక్కువగా ఉందని వన్యప్రాణి నిపుణులు పేర్కొంటున్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల ద్వారా అటవీశాఖకు ప్రస్తుతం ఏటా సగటున రూ.2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది.
కర్నాటక, మహారాష్ట్రతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ.. సరైన వసతులు కల్పిస్తే మరింత ఆదాయాన్ని పెంచవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యాటకుల ఆదరణ ఎక్కువగా ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి ఏటా రూ.1.80 కోట్ల నుంచి రూ. 2.20 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి ఏటా రూ. 40 లక్షల నుంచి రూ. 80 లక్షలకుపైగా ఆదాయం వస్తుంది. రాబోయే రోజుల్లో మరింత ఆదాయాన్ని పెంచాలని అటవీశాఖ వ్యూహాలు రచిస్తోంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త సఫారీ వాహనాలు, లగ్జరీ కాటేజీలు, నైట్ సఫారీలను అందుబాటులోకి తేవడానికి కసరత్తు చేస్తోంది.
ఆ పులులకు మహా క్రేజ్..
మహారాష్ట్రలోని తడోబాలో 'మట్కాసూర్', ఉత్తరప్రదేశ్ దుధ్వాలో 'గబ్బర్' వంటి ప్రత్యేక ప్రవర్తన కలిగిన పులులను చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఆ టైగర్ రిజర్వ్‌లకు ప్రత్యక్షంగా ఆదాయం రావడమే కాకుండా, గైడ్లు, హోటళ్లు, టాక్సీ డ్రైవర్లు, స్థానిక గిరిజన గ్రామాలకు ఆర్థిక లబ్ధి చేకూరుతోంది. ఇదే తరహాలో అమ్రాబాద్‌లోని పులులు కూడా ఇప్పుడు పర్యాటకులకు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నాయి. వీటి ద్వారా వైల్డ్‌లైఫ్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే కోట్లలో ఆదాయంతోపాటు స్థానిక గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని అటవీశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్‌డీసీ) ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో హోమ్‌స్టేలు, వరల్డ్ క్లాస్ ఎకో-లాడ్జీలు, ప్రత్యేక సఫారీ రైడ్లు అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సఫారీ సర్క్యూట్లు, శిక్షణ పొందిన గైడ్లను సిద్ధం చేస్తున్నారు.
సంరక్షణతోనే సమగ్ర అభివృద్ధి..
ప్రస్తుతం అమ్రాబాద్‌తో పోలిస్తే కవ్వాల్‌లో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) అనుమతితో ఇతర ప్రాంతాల నుంచి పులులను ఇక్కడికి తీసుకొచ్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. కొత్త పులులను తేవడమే కాదు వాటి సంరక్షణకు అనుకూలమైన వాతావరణాన్ని, నిఘాను బలోపేతం చేయాలని వన్యప్రాణి నిపుణులు పేర్కొంటున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో అటవీ ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ పులుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని చెప్తున్నారు.
రిజర్వ్ పరిధిలోని గిరిజనులను ఖాళీ చేయించేటప్పుడు పునరావాసం లేదా వారికి ఉపాధి కల్పించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఎవరినీ నిర్వాసితులను చేయకూడదని, అడవి చుట్టూ ఉన్న గిరిజనులకు పర్యాటక రంగంలో భాగస్వామ్యం కల్పిస్తే పులుల సంరక్షణ సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ 'వైల్డ్‌లైఫ్ టూరిజం హబ్'గా మార్చేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు.
