ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 15 కొత్త బీసీ కాలేజీ హాస్టళ్లు, 10 గురుకులాలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్‌లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్ అధ్యక్షతన విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల్లో ఉన్నత విద్యపై ఆసక్తి పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా హాస్టల్ వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గురుకులాలు బాగా పనిచేస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్లకు బదులు వాటిలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నిఖిల్ పటేల్, కార్తీక్ పటేల్, జస్వంత్, కౌశిక్, వంశీ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
