గత పదేళ్లలో భారతదేశ విద్యా వ్యవస్థలో చోటు చేసుకున్న ఒక ఆందోళనకరమైన మార్పు గురించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పార్లమెంటులో కీలక వివరాలు వెల్లడించింది. గత పదేళ్లలో అంటే 2014 నుండి 2024 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 93 వేల కంటే పైగా స్కూల్స్ శాశ్వతంగా మూతపడ్డాయి. ఈ మార్పు ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో ఎక్కువగా కనిపిస్తోంది.
2014-15లో భారతదేశంలో మొత్తం 11.07 లక్షల స్కూల్స్ ఉండేవి. కానీ 2024-25 నాటికి 10.13 లక్షలకు పడిపోయింది. అంటే, పదేళ్ల కాలంలో సుమారు 94వేల స్కూల్స్ రికార్డుల నుండి తొలగించబడ్డాయి.
అయితే స్కూల్స్ మూసివేతలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో సుమారు 24 వేల 500 స్కూల్స్ మూతపడగా.... మధ్యప్రదేశ్ లో 2014 నుండి ఇప్పటివరకు సుమారు 28 వేల 900 స్కూల్స్ మూసివేయబడ్డాయి. ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణ & పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ అంటే ఒక్క విద్యార్థి కూడా లేని స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయని డేటా చెబుతోంది.
ప్రభుత్వం దీనికి మూడు ముఖ్య కారణాలను చెబుతోంది. చాలా స్కూళ్లలో చేరే పిల్లల సంఖ్య భారీగా తగ్గిపోవడం.. ప్రజలు ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకు వెళ్లడం వల్ల గ్రామీణ స్కూళ్లలో పిల్లలు కరువయ్యారు. వనరులను ఆదా చేయడానికి, సౌకర్యాలను మెరుగుపరచడానికి తక్కువ మంది పిల్లలున్న చిన్న చిన్న స్కూల్స్ కలిపి ఒక పెద్ద స్కూలు గా మారుస్తున్నారు.
ప్రభుత్వం స్కూళ్ల విలీనం మంచిదే అని చెబుతున్నా, విద్యావేత్తలు మాత్రం కొన్ని సమస్యలను ఎత్తి చూపుతున్నారు. స్కూళ్లను విలీనం చేయడం వల్ల పిల్లలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు ఇబ్బందిగా మారుతుంది. మారుమూల గ్రామాల్లో స్కూల్స్ మూతపడటం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎవరికీ విద్య దూరం కాకుండా రవాణా సౌకర్యాలు కల్పిస్తామని, మిగిలిన పాఠశాలల్లో వసతులు పెంచుతామని హామీ ఇస్తోంది.
