జపాన్‌లో బుల్లెట్ రైలు శిక్షణ తీసుకుంటున్న భారతీయ పైలట్లు.. ఇక ముంబై టు అహ్మదాబాద్ జస్ట్ 2 గంటలే!

 జపాన్‌లో బుల్లెట్ రైలు శిక్షణ తీసుకుంటున్న భారతీయ పైలట్లు.. ఇక ముంబై టు అహ్మదాబాద్ జస్ట్ 2 గంటలే!

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు కల సాకారం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ హై-స్పీడ్ రైలు కోసం మన భారతీయ పైలట్లు జపాన్‌లో శిక్షణ పొందుతున్నారు. భారతదేశ  మొట్టమొదటి 'షింకన్సెన్' బుల్లెట్ రైలు నడపడానికి 15 మంది భారతీయ రైల్వే నిపుణుల బృందం ప్రస్తుతం జపాన్‌లో  శిక్షణ పొందుతోంది.

జపాన్ రైల్వేలో భద్రత కోసం వాడే ఒక ప్రత్యేక పద్ధతిపై ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో పైలట్ ప్రతి పరికరాన్ని వేలితో చూపిస్తూ, దాని గురించి గట్టిగా చెబుతారు. దీనివల్ల పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా రైలును నడపవచ్చు. కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా, జపాన్ దేశపు క్రమశిక్షణ, భద్రతా నియమాలను వీరు నేర్చుకుంటున్నారు.  ఈ బృందంలో మెట్రో, సాధారణ రైళ్లను నడిపిన అనుభవం ఉన్న సీనియర్ అధికారులు ఉన్నారు.

 508 కిలోమీటర్ల పొడవైన  ముంబై-అహ్మదాబాద్  ప్రాజెక్ట్ పనులు నవంబర్ నాటికి 56 శాతం పూర్తయ్యాయి. ఇప్పటివరకు సుమారు రూ. 85 వేల 338 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యేసరికి రూ. 1.08 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

ఎప్పుడు  అందుబాటులోకి వస్తుందంటే : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 2027 నాటికి సూరత్ - వాపి మధ్య 100 కి.మీ మొదటి బుల్లెట్ రైలు ప్రారంభం కానుంది. ప్రాజెక్ట్ పూర్తిగా పూర్తయ్యాక, ముంబై నుండి అహ్మదాబాద్‌కు కేవలం 1 గంట 58 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం పట్టే సమయంతో పోలిస్తే  చాలా తక్కువ.

 ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) పూర్తి సాంకేతిక సాయం అందిస్తోంది. భారతదేశంలో రవాణా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ బుల్లెట్ రైలు కీలక పాత్ర పోషించనుంది.